అత్యాచార నేరానికి దౌత్యవేత్తలకు మినహాయింపు ఉంటుందా?
posted on Sep 18, 2015 @ 10:06PM
చమురు బావులతో సంపన్న దేశంగా మారిపోయిన సౌదీఅరేబియాలో నేటికీ రాజరిక వ్యవస్థే కొనసాగుతోంది. అక్కడ చట్టాలు చాలా కటినంగా అమలు చేస్తుంటారు. అందుకే అక్కడ నేరాలు, అవినీతి కూడా చాలా తక్కువే. అటువంటి దేశం నుండి డిల్లీకి వచ్చిన దౌత్యవేత్త మజీద్ హసన్ అసుర్ తన ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్న నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలను గత రెండు మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తను అత్యాచారం చేయడమే కాకుండా తన ఇంటికి వచ్చిన తన స్నేహితులకు కూడా ఆ మహిళలను అప్పజెప్పేవాడు. ఆ నేపాలీ మహిళలు ఇద్దరూ ఎలాగో అతికష్టం మీద తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ అతనికి దౌత్యపరమయిన రక్షణ ఉపయోగించుకొని అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు. సౌదీ ప్రభుత్వం అతనిని తక్షణమే స్వదేశానికి తిరిగి రప్పించుకొని అతనిని కాపాడింది.
ఒకవేళ ఇదే నేరం సౌదీఅరేబియాలోనే జరిగి ఉండి ఉంటే సౌదీ ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా ఆ నేరానికి పాల్పడిన వ్యక్తికి మరణ దండన అమలుచేసి ఉండేది. కనుక భారత చట్టాల ప్రకారం తన దౌత్యవేత్తను కూడా శిక్షించేందుకు సౌదీ ప్రభుత్వం సహకరించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ దౌత్యవేత్తగ తన దేశ పేరు ప్రతిష్టలు ఇనుమడించేలా చాలా హుందాగా వ్యవహరించవలసిన అసుర్ చాలా తీవ్రమయిన నేరం చేస్తే, అతనిని కాపాడే ప్రయత్నం చేసి సౌదీ ప్రభుత్వం అంతకంటే పెద్ద తప్పు చేసినట్లయింది. తమ దేశంలో అమలు చేసే చట్టాలు, శిక్షలు కేవలం సామాన్య పౌరులకే కానీ మజీద్ హసన్ అసుర్ వంటి దౌత్యవేత్తలకి వర్తింపజేయదని చాటుకొన్నట్లు అయింది.
తమ దేశానికి చెందిన మహిళలపై భారత్ లోనే అత్యాచారం జరిగింది కనుక భారత్ చట్టాల ప్రకారం వారికి న్యాయం చేయాలని నేపాల్ కోరుతోంది. ఈ నేరం చేసిన సౌదీ దౌత్యవేత్తతో బాటు అతనితో ఈ నేరంలో పాల్గొన్న వారందరిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని నేపాల్ ప్రభుత్వం కోరుతోంది. నేపాల్ ఆ విధంగా కోరడంలో సహజమే. కానీ ఆ సౌదీ అసురుడు తనకున్న దౌత్య కవచాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటికే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇక అతనిని వెనక్కి రప్పించి శిక్షించడం దాదాపు అసంభవమేనని చెప్పక తప్పదు.
అనేక కారణాల వలన భారత్-నేపాల్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సౌదీ దౌత్యవేత్త, సౌదీ ప్రభుత్వం చేసిన ఈ తప్పుల వలన నేపాల్ ప్రభుత్వానికి భారత్ సంజాయిషీలు ఇచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇరు దేశాల సంబంధాలు దెబ్బ తింటున్నాయి. సౌదీ అరేబియా దేశంలో లక్షలాది భారతీయులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. కనుక భారత ప్రభుత్వం సౌదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగలేదు. అలాగని ఇంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిని ఉపేక్షించలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భారత్ ఉందిప్పుడు. దౌత్యవేత్తగా అతనికి వియన్నా ఒడంబడిక ప్రకారం రక్షణ కలిగి ఉంటాడు కనుక భారత్ అతనిని అరెస్ట్ చేయకూడదని సౌదీ వాదించింది. కానీ అటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తికి శిక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ భారత్ చట్టాలను మాత్రం అది గౌరవించాలనుకోవడంకోలేదు.