మేము అధికారంలోకి వస్తే... అమరావతి నుంచే : సజ్జల
posted on Sep 13, 2025 @ 5:12PM
సకల విభాగాల మాజీ మంత్రి, తాజా వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ లేడూ.. సజ్జలనీ.. అంటార్లెండి. ఇపుడీ సజ్జాల దేవ ఏమంటాడంటే.. మేము మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలనంటాడు. మరీ మాట నమ్మొచ్చా? అన్నది ఒక ప్రశ్న కాగా.. మనమిపుడు అర్జంటుగా ఫ్లాష్ రీల్ ఒకటి తిప్పాల్సి ఉంటుంది మరి..
అదెలాంటిదంటే.. గతంలో ఇదే అమరావతి విషయంలో.. జగన్ అన్న మాటలను బట్టీ చూస్తే.. ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయడం అనే అంశం మీద తనకెలాంటి వ్యతిరేకత లేదంటూనే మూడు రాజధానుల ముచ్చట సడెన్ గా వెలుగులోకి తెచ్చాడు.. ఆపై ప్రాంతీయ విబేధాలకు ఆజ్యం పోశాడు.. అమరావతిని కావాలంటూనే దాన్ని భ్రష్టు పట్టించాడు. ఇక కర్నూలు, విశాఖను కూడా ఎగదోశాడు. దక్షిణాఫ్రికా మోడల్ అంటూ మూడు రాజధానుల మంట పెట్టాడు.
కట్ చేస్తే విశాఖ నుంచే తన పాలన అంటూ రుషి కొండ ప్యాలెస్ నిర్మించి మరీ చాటింపు వేయించాడు. అన్ని వేదికల నుంచి అందరికీ అదే చెప్పాడు. విశాఖలో తన రెండో ప్రమాణ స్వీకారోత్సవం అంటూ ఫలితాల ముందే నానా హంగామా నడిపించాడు. ఆంధ్రుల అదృష్టం బాగుండి.. ఎలాగో ఆ ప్రమాదం తప్పింది.
ఇక తన జమానాలో.. రాజధాని రైతులను అట్టుడికించిన సంగతి సరే సరి. ఆ మాటకొస్తే.. ఇదే రాజధాని రైతులకు ఆశ్రయం ఇచ్చినందుకు కోటంరెడ్డి వంటి వారు ఏకంగా పార్టీ నుంచి బయటకు రావల్సి వచ్చింది. అది వేరే సంగతి. ఇప్పుడేదో పరదా అనే సినిమా వచ్చింది కానీ ఈ సినిమాను జగన్ ఎప్పుడో తీసేశాడు. ఒక సమయంలో అమరావతిలో ఆయన తిరగడానికి అధికారులు అన్నేసి పరదాలు కట్టాల్సి వచ్చింది మరి.
సరే ఇప్పుడేమైనా మనసు మారిందా? అంటే ఏకంగా అధికారిక మీడియా వేదిక పైనుంచి అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్న కామెంట్లు గుప్పించారు. సరే అదేదో ఒక ఔట్ సోర్సింగ్ జర్నలిస్టు అన్నాడు లెమ్మని లైట్ తీస్కుందామనుకుంటే ఆయన పార్టీకి చెందిన కేతిరెడ్డి వంటి ఎమ్మెల్యేలు చేపల రాజధానిగా అభివర్ణించారు. కొన్నాళ్లు పోతే గోదాట్లో దొరికే పులస ఇక్కడే దొరకొచ్చన్న వ్యంగ్యాస్త్రాలు ఇందుకు అదనం. ఇదసలు క్వాంటం వాలీ కావడం కన్నా ఆక్వా వాలీ కావచ్చొనిపిస్తిరి.
మొన్నటి వర్షాలకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ ప్రాంతం మీద కక్ష కట్టినట్టు దాన్ని ఒకటే ట్రోలింగ్ చేస్తిరి. అదేమన్నా చంద్రబాబు అబ్బ సొత్తా??? ఒక రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావల్సిన ప్రాంతం. వీళ్ల పుణ్యమాని.. ఇప్పటికీ అది పురిటి నొప్పులు అనుభవిస్తూనే ఉంది.
2024 ఎన్నికల్లో అమరావతే రాజధానిగా ముందుకెళ్తాం అన్న కూటమి గెలుపుతో ఒక విషయం అయితే పబ్లిక్ నుంచి రెఫరండం గా వెలుగులోకి వచ్చింది. అలాగని దాన్ని గుర్తించకుండా.. తన మీడియా చేత, మనుషుల చేత, సోషల్ మీడియా ద్వారా చేయించాల్సిన కామెంట్లన్నీ చేయించి.. ఇప్పుడు తన నీడలాంటి సజ్జల చేత.. ఈ సారి మేం గెలిస్తే అమరావతి నుంచే పాలన అంటే నమ్మడానికి ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నట్టు???
గతంలో ఏకంగా అధినేత అన్న మాటలకే దిక్కు లేదు.. అలాంటిది ఆయన నీడ ద్వారా చెప్పిస్తే మాత్రం అబద్ధం నిజమై పోతుందా? మారిన మూడు రాజధానుల మూడ్ అన్నది ఎస్టాబ్లిష్మెంటు అవుద్దా!!! అంటారు సగటు అమరావతి వాసులు. ఏతా వాతా దీనంతటినీ బట్టి చూస్తుంటే.. ఏదో ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చేద్దామని ఫీలవుతున్నట్టుందీ మడమ తిప్పని బ్యాచీ. తిప్పాల్సినవన్నీ తిప్పేసి ఎట్టకేలకు తిరిగి అధికారంలోకి వచ్చాక ఎడం కాలితో తన్నడం ఎలాగూ అలవాటైందిగా అన్న గట్టి నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నట్టు కొడుతోంది..
ఒకసారి జరిగిన శాస్తి చాలదని.. రెండో సారి కూడా తిరిగి దొంగ చేతికే తాళాలివ్వడమా!? ఎంత మాట.. ఎంత మాట.. అన్న కామెంట్లు అమరావతి మాత్రమే కాదు హోల్ ఆంధ్రా అంతటా వినిపిస్తూనే ఉన్నాయ్. అందుకే అనేది నీళ్లలో ఉన్న ముసలితో, అధికారంలో లేని జగనుతో అస్సలు పెట్టుకోవద్దనేదని డైరెక్టుగానే అనేస్తున్నారు చాలా మంది.