కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు
posted on Nov 9, 2012 @ 11:46AM
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వింత జరిగింది. పొద్దున్నే ఫుల్లుగా తాగి డ్యూటీఎక్కిన డ్రైవర్ గారు నేరుగా బస్సుని నదిలోకి పోనిచ్చేశారు. మానపాడు మండలం పాలపాడులో బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరాల్సిందిపోయి నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్నప్రయాణికుల టైం బాగుండి కొద్దిలో ప్రమాదం తప్పినా.. ఓ పదిమందికి మాత్రం బానే గాయాలయ్యాయి.
నదిలో బస్సాగగానే జనం బతుకు జీవుడా అంటూ కిందికి దూకేసి మెల్లగా చేతులూ చేతులూ పట్టుకుని బైటికొచ్చేశారు. తాగుబోతు డ్రైవర్ కి బస్సుని అప్పజెప్పి జనం ప్రాణాలతో చెలగాటమాడడం ఏంటని బాధితులు డిపో అధికారుల్ని నిలదీస్తున్నారు. సిబ్బంది ప్రవర్తన, తీరు తెన్నుల్ని గమనించకుండా అధికారులు కళ్లుమూసుకుని కూర్చున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీన్నింతటితో వదిలేస్తే మరోసారి మరో ప్రమాదం కచ్చితంగా జరుగుతుందని, జనం ప్రాణాలు గాల్లో
కలిసిపోతాయని బాధితులు అంటున్నారు. వెంటనే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తోపాటు,
బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులందర్నీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని ఊదరగొట్టడం కాదని, ఇలాంటి ఘటనలు జరక్కుండా
చూసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యంపై ఉందని మండిపడుతున్నారు.