రాయలసీమ అభివృద్ధి పేరుతో స్వార్ధ రాజకీయాలు చేస్తే?
posted on Sep 9, 2015 8:31AM
మాజీ మంత్రి టి.జి. వెంకటేష్ ఎన్నికలకు ముందు తెదేపాలో చేరినప్పటికీ, ఎన్నికలలో ఓడిపోవడంతో మళ్ళీ ప్రభుత్వంలో చేరి చక్రం తిప్పాలనే ఆయన ఆశ నెరవేరలేదు. బహుశః అందుకే ఆయన మొదటి నుండి తెదేపాతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. త్వరలోనే తెదేపాని వీడి స్వంత కుంపటి పెట్టుకోబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ గా వ్యవహరిస్తున్న టి.జి.వెంకటేష్ నిన్న మీడియాతో మాట్లాడుతూ “త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి. ఒకవేళ ఇదే తీరుకొనసాగితే రాయలసీమ ప్రత్యక రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెడతాము,” అని ప్రకటించారు.
“రాయలసీమకు న్యాయం జరగాలంటే ఇక్కడ రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి. రాయలసీమ జిల్లాలకు సాగునీటి సౌకర్యం, పారిశ్రామిక అభివృద్ధి చేయవలసి ఉంది. కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలి. అదే విధంగా ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కూడా 6 జిల్లాలుగా విభజించాలి. కర్నూలులో ఉన్న భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడాన్ని మేము నిరసిస్తున్నాము. వృధాగా పడున్న ఆ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు నెలకొల్పడానికి కేటాయించాలి తప్ప పారిశ్రామికవేత్తలకు కాదు. గత ప్రభుత్వం ఆమోదించిన సుంకేశుల డ్యామ్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి,” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
టి.జి.వెంకటేష్ నిజంగానే రాయలసీమ అభివృద్ధిని కోరుకొంటున్నట్లయితే ఆయన అధికార పార్టీలోనే ఉన్నారు కనుక ఈ సమస్యలన్నిటినీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేయవచ్చును. కానీ మంత్రి పదవి లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నందునే ఆయన రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతున్నారని అర్ధం అవుతోంది. తనకు అధికారం దక్కకపోవడంతో రాయలసీమకి అన్యాయం జరిగిపోతోందని వాదిస్తూ అందుకోసం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించడం చాలా శోచనీయం. ఒకవ్యక్తి స్వార్ధం కోసం రాష్ట్రాన్నే విభజించాలని కోరుకోవడం చాలా దురదృష్టకరమయిన ఆలోచన అని చెప్పక తప్పదు.
రాయలసీమ అభివృద్ధి జరగాలని చెపుతున్న టి.జి.వెంకటేష్ పరిశ్రమల స్థాపనకు వృధాగా పడున్న ప్రభుత్వ భూములను ఇవ్వడాన్ని వ్యతిరేకించడం గమనార్హం. అదేవిధంగా అసంభవమని తెలిసి కూడా రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. కనుకనే సీమ జిల్లాలపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఆయనని నిలదీసేందుకు జగన్ ఉండనే ఉన్నారు. కనుక రాయలసీమ నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశమే లేదు.
కృష్ణా-గుంటూరు జిల్లాలలో రాజధాని ఏర్పాటు అవుతోంది కనుక అక్కడ మిగిలిన జిల్లాల కంటే వేగంగా అభివృద్ధి జరుగవచ్చును. కానీ అంతమాత్రాన్న మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందడం లేదని ప్రజలలో అపోహలు సృష్టించడం సరికాదు. శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద జపాన్ సంస్థ సహకారంతో అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏర్పాటు, చిత్తూరులో ఉన్నత విద్యాసంస్థలు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటుకి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయనే సంగతి ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ నేర్పిన గుణపాఠంతో ఇప్పుడు రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని జిల్లాలను సమానంగా సమగ్రాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్దం చేసి అమలుచేయడం మొదలుపెట్టింది.
రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి నిలద్రొక్కుకోవడానికి తిప్పలు పడుతుంటే, అందరూ కలిసి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించకుండా అధికార దాహంతో ఈవిధంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం చాలా శోచనీయం. ఒకవేళ మళ్ళీ రాష్ట్ర విభజన ఆందోళనలు మొదలయితే ఇక ఆంద్రప్రదేశ్ మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేదనే వాస్తవం అందరూ గ్రహించి అటువంటి ప్రయత్నాలు చేయాలనుకొంటున్న స్వార్ధ రాజకీయ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలి.