ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం మైసూరా నేతృత్వంలో త్వరలో ఉద్యమాలు
posted on Nov 4, 2015 @ 7:47PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర తిరక్కుండానే మళ్ళీ మరోసారి రాష్ట్ర విభజనకి రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఉద్యమాలు మొదలుపెట్టడానికి సిద్దం అవుతున్నారు. వైకాపా నేత మైసూరా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తో ఈనెల 21వ తేదీన “రాయలసీమ రాష్ట్ర సాధన సమితి”ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకోసం మైసూరా రెడ్డి వైకాపాకు రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇవ్వాళ్ళ సాయంత్రం రాయలసీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు తమ భవిష్య కార్యాచరణ గురించి చర్చించేందుకు కర్నూలులో సమావేశమయినట్లు సమాచారం. రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రంలో అన్ని పార్టీలలో సీమకు చెందిన నేతలను తమ పోరాటాలలో పాలుపంచుకొనేందుకు ఆహ్వానించాలని వారు నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాలనే అభివృద్ధి చేస్తూ రాయలసీమ జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారి ప్రధాన ఆరోపణ. రాజధాని నిర్మాణం పూర్తయితే అప్పుడు ఇంతకు ముందు తమని హైదరాబాద్ నుంచి ఏవిధంగా బలవంతంగా బయటకు వెళ్ళగొట్టారో మళ్ళీ అదే విధంగా అమరావతి నుంచి కూడా తమను బయటకు వెళ్ళగొడతారని కనుక అటువంటి పరిస్థితి దాపురించకముందే ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమను విడగొట్టి ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయబోతున్నారు.
ఈ ఉద్యమానికి కాంగ్రెస్, వైకాపా నేతలు చేతులు కలుపుతుండటం గమనిస్తే వారు రాయలసీమ కోసం కాక ఆ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసమే చేతులు కలుపుతున్నట్లున్నారు. వారిలో కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటం చేత మళ్ళీ రాష్ర్ట విభజనకి ‘సై’ అంటున్నట్లు అనుమానం కలుగుతోంది. అధికార తెదేపాను కేవలం తమ రాజకీయ ప్రత్యర్ధి పార్టీగా కాక దానిని తమ ఆగర్భ శత్రువులా వైకాపా భావిస్తుండటం చేత వైకాపా నేతలు ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సిద్దమవుతున్నట్లు ఉంది.
మూడు నెలల క్రితం రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలో కాంగ్రెస్ వైకాపాలు క్రమంగా దగ్గరవడం మొదలయింది. అందుకు ప్రత్యేక హోదా అంశం వాటికి ఒక మంచి అవకాశం కల్పించింది. కానీ ప్రత్యేక హోదాపై అవి చేస్తున్న పోరాటాలకి ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఈ వేర్పాటు ఉద్యమానికి సిద్దం అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడం చాలా శోచనీయం. వారు రాయలసీమ ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని మళ్ళీ అగ్నిగుండంగా చేయక మునుపే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తగు చర్యలు చేపడితే మంచిది. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.