కాంగ్రెస్ లో రాజగోపాల రాగం నాన్ స్టాప్!
posted on Aug 31, 2025 @ 9:33AM
అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యి ఆపై మంత్రి వర్గంలో చోటు సంపాదించేలా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ సైతం సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ కి వచ్చేశారు. కానీ ఇప్పటి వరకూ రాజగోపాల్ రెడ్డి కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎంతకీ తెమలడం లేదు. ఆయన కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే అసెంబ్లీకి రావడం ఎలా సాధ్యమంటూ మారాం చేస్తున్నారు. తన నిరసన మరో రకంగా తెలియ చేస్తున్నారు.
అసలేంటీ రాజగోపాల్ రెడ్డి స్టోరీ అని చూస్తే.. మరేం లేదు ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి ఎందుకివ్వాలి? ఆయనేమైనా పెద్ద తోపా? ఆ మాటకొస్తే ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రి పదవులు ఎలా ఇస్తారు? నిన్నమొన్నటి వరకూ కేసీఆర్ కుటుంబాన్ని ఇలాగే ఆడిపోసుకుని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుందా? అని ప్రశ్నించేవారు ఏకంగా కాంగ్రెస్ నుంచే పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు.
కానీ రాజగోపాల్ రెడ్డి ఇంత మంకు పట్టడానికి కూడా రీజన్ ఉంది. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఖాయమంటూ.. సాక్షాత్ రేవంత్ రెడ్డే హామీ ఇచ్చారు. నాకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను. మరి నాకు ఇవ్వాల్సిన మంత్రి పదవి మీరు ఇవ్వాలిగా అంటూ నిలదీస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.
మొన్నటికి మొన్న ఆరు సీట్ల గ్యాప్ ఉంటే.. అందులో మూడు భర్తీ చేశారు. మరో మూడింటికి ఇంకా స్కోప్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవ్వరూ లేరు కాబట్టి మాకిచ్చి తీరాల్సిందేనని ఈ జిల్లా వాసులు పట్టుబడుతున్నారు. ఇక నిజామాబాద్ సంగతి సరే సరి. సుదర్శన్ రెడ్డికి ఇస్తాం ఇస్తామని మొండి చేయి చూపించినట్టుగా ఆయన తెగ ఫీలవుతున్నారు. ఇలాంటి ప్రాతినిథ్యం లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి. వీరందరినీ వారించడానికి ఊరించడానికి మీనాక్షి నటరాజన్ వేసిన స్కెచ్ ఈ మిగులుబాటు చర్యలు. వచ్చే స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఈ ఊరింపు ఉంటేనే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇతర నాయకులు సరిగ్గా పని చేస్తారంటూ ఆమె ఈ స్ట్రాటజీ ప్లే చేశారు.
దీన్నిబట్టిచూస్తే రాజగోపాల్ రెడ్డికి ఒక అవకాశమైతే ఉంది. కానీ ఇస్తారా? అన్న దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. ఎందుకంటే ఆల్రెడీ మంత్రివర్గంలో అందరికన్నా రెడ్ల సంఖ్యే ఎక్కువ. అలాంటిది మరో రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం జరిగే పని కాదన్నది అంచనా. అయితే రాజగోపాల్ రెడ్డి వంటి వ్యాపారుల వల్ల కాస్త ప్రయోజనం ఉంటుంది. వారి ద్వారా పెట్టుబడిదారులు ముందుకొస్తారు. వారికున్న వ్యాపార సంబంధ బాంధవ్యాలు అలాంటివి. కాబట్టి.. మంచిదే కానీ అది జరిగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా? లేక బీజేపీలోకి వెళ్లిపోతారా? ఆయన్ను మీనాక్షి నటరాజన్ ఎలా బుజ్జగించనున్నారు? అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇంకేదైనా ప్రాధాన్యతా పదవి ఇవ్వడానికి అవకాశముంది. ఒక వేళ ఉంటే అదెలాంటిదై ఉంటుంది? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పరిశ్రమలకు సంబంధించిన ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే బావుంటుందని అంటున్నారు కొందరు. అవి ఏవై ఉంటాయని చూస్తే.. ఒకటి స్పోర్ట్స్, రెండు మూసీ ప్రాజెక్టు.. రేవంత్ తీస్కున్న ప్రాధాన్యతాంశాల్లో ఇవి కీలకం. ఇటీవల కపిల్ దేవ్ ని కూడా రేవంత్ అదే పనిగా పిలిచి మరీ సన్మానించారు. ఇలాంటి బాధ్యతలను ఏవైనా అప్పగిస్తే ఏదైనా రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా? అన్నది కూడా తేలాల్సి ఉంది.