ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా పాదయాత్రలేల?
posted on Jul 13, 2015 @ 11:37AM
కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ఉద్దరించాలని ఆలోచించేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు నెలలపాటు విదేశాలలో తిరిగివచ్చేరు. ఆ తరువాత ప్రధాని మోడీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆయన దైర్యంగా ఎడాపెడా విమర్శించేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించేరు కూడా. కానీ రెండు నెలలు స్వదేశంలో తిరిగేసరికి ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసినట్లుంది. గత పదేళ్ళలో ఆయన పార్టీపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయినా ఇప్పుడయినా చూపుతారనుకొంటే అటువంటి సూచనలేవీ కనబడటం లేదు. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గానీ కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు ఈ రెండు నెలల్లో ఆయన చేసిన ప్రయత్నం ఏమీ కనబడలేదు. ఆయన విదేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు, పాదయాత్రలు చేయడం తప్ప మరేమీ చేయలేదు.
ఇంతకు ముందు ఆయన తెలంగాణాలో పర్యటించినందువలన కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం కలిగిందో ఎవరికీ తెలియదు. కానీ పార్టీలో నుండి బయటకు పోయేవారు పోతూనే ఉన్నారు. ఈనెల 24వ తేదీన ఆయన అనంతపురం జిల్లా కేంద్రం నుండి కొండకర్ల గ్రామం వరకు పాదయాత్ర చేస్తారని ఏపి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. షరా మామూలుగానే రాహుల్ గాంధీ ఉరుకుల పరుగుల మీద తన పాదయాత్ర పూర్తిచేసుకొని , పనిలోపనిగా తెదేపా ప్రభుత్వం కొన్ని విమర్శలు చేసిపోతారు. కానీ దాని వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమిటి? అంటే ఏమీ ఉండదనే చెప్పవచ్చును.
ఇప్పటికే రాష్ట్రంలో సగం మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన దెబ్బకి రాజకీయ సన్యాసం తీసుకోగా, మరికొంత మంది వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తప్ప పార్టీలో మిగిలినవారు ప్రజలకు మొహాలు చూపించి చాలా కాలమే అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పుడు దానిని మళ్ళీ పునర్జీవింపజేసుకొనే ప్రయత్నాలు చేయకుండా రాహుల్ గాంధీ తన స్వంత ప్రచారం కోసం పాదయాత్రలు చేస్తుండటం గమనిస్తే ఆయన ఒక దశ దిశా లేకుండా ముందుకు సాగుతున్నట్లుంది. మరి రెండు నెలలపాటు విదేశాలలో తిరిగి ఆయన కనుగొన్నదేమిటో ఆయనకే తెలియాలి.
ఇంతవరకు సోనియా గాంధీయే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారనే భావన ప్రజలలో, పార్టీ నేతలలో, కార్యకర్తలలో నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి నేతృత్వంలో ముందుకు సాగుతోందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు పార్టీని వీడిపోతుంటే వారిని ఎవరూ ఆపకపోవడం గమనిస్తే రాహుల్ గాంధీ పెత్తనం చేస్తున్నట్లు కనబడుతుంది. కానీ దశదిశా లేకుండా ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీని గమనిస్తే నేటికీ సోనియా గాంధీయే వెనుక నుండి పార్టీని నడిపిస్తున్నట్లనిపిస్తుంది. కనుక సోనియా, రాహుల్ గాంధీలలో ఎవరు పార్టీకి నాయకత్వం వహించాలనే విషయంపై ఒక స్పష్టతకు వచ్చిన తరువాత పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు అవసరమయిన చర్యలు చెప్పట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి ఏమయినా ప్రయోజనం ఉంటుంది తప్ప రాహుల్ గాంధీ ఇటువంటి ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు.