పాపం...కాంగ్రెస్ పార్టీ!
posted on May 9, 2015 @ 12:45PM
కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు నడపాలనే విషయం గురించి రెండు నెలల పాటు విదేశాలలో ఒంటరిగా మేధో మధనం చేసి వచ్చిన రాహుల్ గాంధీ తను స్వయంగా పాదయత్రాలు చేయడం ద్వారా దానిని ‘ఇస్ట్రాంగ్’ చేసుకోవచ్చని ఫిక్స్ అయిపోయి చకచకా నడవడం మొదలుపెట్టారు. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి చేసిన సవరణల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రచారం చేస్తూ, అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ ముందుకు సాగినట్లయితే ఒకవైపు మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రైతులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవచ్చని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. లేదా ప్రజల, మీడియా దృష్టిని ఆకట్టుకోగలిగితే తన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న తన పార్టీ నేతల నోళ్ళనును తాత్కాలికంగా అయినా మూయించవచ్చనే ఆలోచన కావచ్చును. కానీ ఆయన మొదలుపెట్టిన పాదయాత్రల వలన పార్టీకి లాభం కలగడం మాటేమో కానీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు.
ఆయన డిల్లీలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని సభలు నిర్వహించుకొన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఆయన పనిగట్టుకొని వివిధ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో పాదయాత్రలు చేస్తూ, ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి పూనుకోగానే, ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు ఆయనపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఈనెల 12న పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించగానే అధికార తెరాస కంటే ముందుగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత పదేళ్ళ పాలనలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే సుమారు 22,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అప్పుడు అధికారంలో ఉన్న రాహుల్ గాంధీ వారిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు? కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి ఘాటుగా ఒక లేఖ కూడా వ్రాసారు. రైతుల ఈ దుస్థితికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణమని తెరాస వాదిస్తోంది.
రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబోయే ఒక్క రోజు పాదయాత్రలో 5 గ్రామాలలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకొన్న 12 మంది రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, స్థానిక కాంగ్రెస్ నేతల తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. దానితో జిల్లాలో మిగిలిన ప్రాంతాలలో ఆత్మహత్యలు చేసుకొన్న అనేక మంది రైతుల కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని విమర్శించడం మొదలుపెట్టారు. మొక్కుబడిగా ఓ పదిమంది రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందించి, రాహుల్ గాంధీ తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న వేలాది రైతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారందరికీ ఆర్ధిక సహాయం అందించడం సాధ్యం కాదు కనుక రాహుల్ గాంధీ కేవలం కొందరిని మాత్రమే కలుస్తున్నారు. అయితే దాని వలన మిగిలిన రైతులలో అసంతృప్తి, ఆగ్రహం కలిగిస్తున్నట్లయింది.
రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోయే ఆదిలాబాద్ జిల్లాలోనే 2004-2014 మధ్య కాలంలో 610 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని అధికారిక లెక్కలున్నాయి. వారి ఒక్కో కుటుంబానికి రూ.50,000 రుణమాఫీతో కలిపి మొత్తం రూ.1.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వమే జి.ఓ. నెంబర్: 421 ను జారీ చేసిందని, కానీ వారిలో ఏ కొద్దిమందికి తప్ప చాల మందికి నేటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆ పరిహారం అందలేదని జిల్లాకు చెందిన బోరన్న అనే రైతు సంఘం నేత చెపుతున్నారు.
అసలు గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలోనే దేశ వ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీయే స్వయంగా తన పాదయాత్రలతో బయటపెట్టుకొన్నట్లయింది. మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం పార్టీని బలపరుచుకోవడం మాటెలా ఉన్నా, రాహుల్ గాంధీ తన పాదయాత్రల ద్వారా గత పదేళ్ళ కాంగ్రెస్ నిర్వాకాన్ని ఆయనే స్వయంగా లోకానికి చాటి చెపుతున్నట్లయింది.
తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యల లెక్కలు ఇప్పుడు బయటకి వస్తున్నాయంటే అది రాహుల్ గాంధీ పాదయత్రల పుణ్యమేనని చెప్పక తప్పదు. దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమయినా మేలు జరుగుతుందో లేక మరింత నష్టం జరుగుతుందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.
ఆరు నెలలు గరిడి సాము చేసి ఏమి చేశావయ్యా అంటే మూలనున్న ముసలమ్మని ఒక్క దెబ్బతో పైకి పంపించేసానన్నాడుట వెనుకటికొకడు. రెండు నెలలు విదేశాలలో ఏదో మధనం చేసిన రాహుల్ గాంధీ పని కూడా అచ్చు అలాగే ఉంది. ఇప్పటికే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ తన పాదయాత్రలతో మళ్ళీ పైకి లేవకుండా శాస్వితంగా భూస్థాపితం చేసేస్తారేమో? పాపం కాంగ్రెస్ పార్టీ!