ఇదంతా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకేనా?
posted on Mar 18, 2015 @ 8:24PM
సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం, ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. పార్టీకి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ, పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అందుకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వహిస్తున్నామని చెప్పుకొన్నారు కూడా. అయితే దానర్ధం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరేవరిచేతిలోనో పెడతామని కాదని వారు చెప్పకనే చెప్పారు.
రాహుల్ గాంధీ గత పదేళ్లుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టుసాధించలేకపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆయనే దిక్కని చెప్పుకోవలసి వస్తోంది. ఆయన కూడా తనకు పదవుల మీద ఎటువంటి వ్యామోహం లేదని చెపుతూనే, తన పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలనుకొంటారు. పార్టీలో సీనియర్ల కంటే తనే పార్టీని బాగా నడపగలననే భ్రమలో ఉన్నందున వారితో ఏవిషయంలోను ఏకీభవించలేకపొతున్నారు. ఆవిషయాన్ని పార్టీలో సీనియర్ నేత జైరామ్ రమేష్ చూచాయగా చెప్పారు. దానికి ఆయన ‘జనరేషన్ గ్యాప్’ అనే కలరింగ్ ఇచ్చుకొన్నారు. పార్టీలో సీనియర్లకి రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన చెప్పుకొన్నప్పటికీ, అత్యంత ముఖ్యమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ శలవు పెట్టివెళ్లి పోవడం, అందుకు ఆ పార్టీ నేతలు చెప్పుతున్న సంజాయిషీలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత సంక్షోభం నెలకొని ఉందని స్పష్టం అవుతోంది. ఆయన తన శలవుని మరికొన్ని వారాలు పొడిగించడంతో ఈ అనుమానాలను స్వయంగా దృవీకరిస్తున్నట్లుయింది.
పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు వందలమంది ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వారందరిని సంప్రదించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం తెలివయిన నిర్ణయం అనిపించుకొంటుంది. కానీ రాజకీయాలలో రాణించడానికి అవసరమయిన నిలకడ, నేర్పు, లౌక్యం వంటి లక్షణాలేవీ బొత్తిగా లేని రాహుల్ గాంధీ ఒంటరిగా కూర్చొని పార్టీ గురించి ఆలోచించడానికి శలవు పెట్టడం విచిత్రమే. గత పదేళ్లుగా ఆయన అనేక పాఠాలు నేర్చుకొనే అవకాశం కలిగింది. అదేవిధంగా అనేకసార్లు తనను తాను నిరూపించుకొనే అవకాశాలు కలిగాయి. కానీ ఆయన వాటిని ఉపయోగించుకొని తనలో నాయకత్వ లక్షణాలున్నాయని పార్టీకి, ప్రజలకీ కూడా నమ్మకం కల్పించలేకపోయారు. కానీ అవకాశం చిక్కితే 125 కోట్ల మంది జనాభా ఉన్న సువిశాలమయిన భారత దేశానికి ప్రధానమంత్రి అయిపోదామనుకొన్నారు. ఆయన దురదృష్టమో లేకపోతే ప్రజల అదృష్టమో గానీ ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. కనుక కనీసం తన పార్టీ పగ్గాలయినా చేపడుదామనుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ అందుకు కూడా పార్టీలో వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం ఆ తల్లికొడుకులకు చింత కలిగించే విషయమే.
ఒకవేళ రాహుల్ గాంధీకి ఈ అవకాశం కూడా దక్కకపోతే ఇక ఆయన రాజకీయాలలో ఉండటమే అనవసరం. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతే అప్పుడు రాహుల్ గాంధీ ఏమి చేయాలి? ఆయన భవిష్యత్ ఏవిధంగా ఉంటుంది? అనే ఆలోచనలకు జవాబులు చెప్పడం కష్టమే. అటువంటి పరిస్థితి ఎదురయ్యే వరకు వేచి చూడటం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతో ఈ శలవు ఐడియా చేసి ఉండవచ్చును. పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలపై ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనతోనే ఆయన శలవు మీద వెళ్లిపోయుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంట్లోంచి పిల్లాడు అలిగి వెళ్ళిపోయినప్పుడు, “నాయినా నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఇంటికి తిరిగి రా...నీ కోసం అమ్మ బెంగ పెట్టుకొంది. నిన్ను ఎవరూ ఏమీ అనము...వెంటనే ఇంటికి తిరిగి వస్తే నువ్వు అడిగినట్లే బండి కొనిస్తాము...”లేదా ఏదో చేస్తామంటూ ఆ పిల్లాడి తల్లి తండ్రులు పేపర్లో ప్రకటనలు వేయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా అదే పని చేస్తోందని చెప్పవచ్చును.
ఆయన శలవులో వెళ్ళిపోయినప్పటి నుండి “తిరిగి వచ్చిన తరువాత ఆయనే పార్టీ పగ్గాలు చేపడుతారు. ఆయన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కలిగించబోతున్నారు. పార్టీలో సీనియర్లకు ఉద్వాసన పలుకబోతున్నారు,” అంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే మీడియాకు లీకులు ఇస్తున్నారు. అంటే ఆయన కండిషన్లలకు తాము అంగీకరిస్తున్నామని సందేశం పంపుతున్నారన్నమాట. కనుక ఆయన తన శలవు పూర్తి చేసుకొని రాగానే పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారేమో.