రాజీనామా చేస్తే జరిగేది అదే.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి: రఘురామకృష్ణరాజు
posted on Aug 26, 2020 @ 4:36PM
జగన్ సర్కార్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు. ఏపీలో 50 శాతం ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కోరుకోలేదని గుర్తుంచుకోవాలి అన్నారు.
డాక్టర్ రమేష్ ను వేధిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేస్తామని వేధించి అవమానించామని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. కానీ అవమానం జరిగింది డాక్టర్ రమేష్ కు కాదు.. వైద్య వృత్తికి అవమానం చేస్తున్నారని అన్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారిపై కులం పేరుతో కక్ష కట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
ఎంతో అనుభవం ఉన్న రామచంద్రమూర్తి సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా సలహాదారులున్నారు అని గుర్తుచేసిన ఆయన.. చేయడానికి పనిలేదని రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్టున్నారని ఎద్దేవా చేశారు. మిగతావారి విషయంలో జగన్ ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వ సొమ్మును ఆదా చేసినవారు అవుతారని సూచించారు.
శిరోముండనం కేసుపై లేటుగానైనా లేటెస్టుగా సీఎం జగన్ స్పందించినందుకు ధన్యావాదాలని అని ఎద్దేవా చేశారు. ఎంత ముఖ్యమైనవారున్నా వదిలిపెట్టేదిలేదని సీఎం అంటున్నారు. సీఎంకి సమీపబంధువు, పార్టీలోని అతిముఖ్యుడు ఈ ఘటనలో కీలకంగా ఉన్నారని తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటేనే సీఎం చెబుతున్న మాటలు, చేతల్లో చూపుతున్నారన్న పేరు వస్తుందని హితవు పలికారు.
ప్రభుత్వం తాము ఇచ్చిన భూములకు కౌలు చెల్లించలేదని అమరావతి రైతులు నిరసన చేపడితే.. వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. కౌలు చెల్లించడానికి డబ్బు లేనప్పుడు.. మూడు రాజధానులు అవసరమా? అని ఎద్దేవా చేశారు.
ఇక రాజీనామా డిమాండ్ పై కూడా రఘురామ కృష్ణరాజు ఘాటుగా స్పందించారు. తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి చెబితే నన్ను రాజీనామా చేయాలంటారా? అని ప్రశ్నించారు. రాజీనామా చేస్తే ఏమవుతుంది.. మూడు రెట్లు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా అన్నారు. అయినా పెయిడ్ ఆర్టిస్టుల డిమాండ్లను నేను పట్టించుకోను. వైసీపీ దుర్మార్గాలను, లోపాలను ఎత్తిచూపితే భరించలేకపోతున్నారు అని మండిపడ్డారు.
బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని రఘురామరాజు అన్నారు. పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులకు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్ కు పేరుందని ఆయన అన్నారు. ఓ దళిత యువకుడు మద్యంపై మాట్లాడితే.. ఆ వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చంపుతామని బెదిరించారని, దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది అన్నారు. "ప్రాణాలు తీసుకోవడం బాధాకరం. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరు. నాకూ బెదిరింపులు వస్తున్నాయి. ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదు.’’అని చెప్పారు. తనను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలితే మంచిదని రఘురామరాజు హితవు పలికారు.