ఆ ప్రతిష్టాత్మక పథకం టీఆర్ఎస్ పరువు తీసే పథకంలా మారిపోతోందా!!
posted on Aug 28, 2020 @ 3:59PM
టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం.. ఆ పార్టీ పరువు తీసే పథకంలా మారిపోతోంది. రెండున్నర లక్షల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి ఐదేండ్లు పూర్తైయినా.. అందులో ఐదు శాతం మాత్రమే పంపిణి చేశారు. ఇండ్ల నిర్మాణంలో ఆలస్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ప్రారంభానికి ముందే డబుల్ బెడ్ రూం ఇండ్ల స్లాబ్స్ పెచ్చులూడుతుండడం దుమారం రేపుతోంది. రామకృష్ణా పురం పంచాయతీ పరిధి హరిచంద్రపురం గ్రామం గుట్టల సమీపంలో 50 డబుల్బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి ఐటీడీఏ రూ.5.40 లక్షలు కేటాయించింది. ఇండ్ల నిర్మాణాన్ని ఆర్వీఎం ఇంజనీరింగ్ ఆఫీసర్లకు అప్పజెప్పింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశాడు. ఇండ్ల నిర్మాణం పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. బిల్డింగ్ స్లాబ్ మీద చేతితో తీస్తుంటే పెచ్చులూడుతోంది. లోపల అర ఇంచు మందం సిమెంట్ లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే తేలుతుంది.
స్లాబ్ పెచ్చులూడిపోయిన విజువల్స్ ను .. కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్ పనితీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. బంగారు తెలంగాణలో ఇండ్లు ఇలాగే నిర్మిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యతపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎలా ఉండాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ తో పాటు స్థానికులు డబుల్బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఆందోళన చేశారు. నాణ్యతా లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంపిణి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాసిరకంగా ఉన్నాయని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షానికి నీరు గోడలపై కారింది. మరికొన్ని చోట్ల స్లాబు, గోడలకు పగుళ్లు వచ్చాయి.
కామేపల్లి ఘటనతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర ఇండ్ల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు సమయానికి రాకపోవడం కారణమంటున్నారు. బిల్లులు రాకపోవడంతో విసిగిపోతున్న కాంట్రాక్టర్లు.. నాసిరకంగా నిర్మాణాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు.. అడ్డగోలుగా ఇండ్లు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.