పుష్కరాలపై శవారాజకీయాలేల?
posted on Jul 15, 2015 @ 10:24AM
గోదావరి పుష్కరాల తొలిరోజే ఏకంగా 27మంది భక్తులు త్రొక్కిసలాటలో మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది. ఎంత విపత్కర పరిస్థితుల్లో నయినా ఎంతో నిబ్బరంగా వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట తడిపెట్టి, తన వల్లే ఈ తప్పు జరిగిందని ప్రజలు భావిస్తే క్షమించమని పుష్కర యాత్రికులని కోరడం గమనిస్తే జరిగిన దానికి ఆయన ఎంత బాధ పడుతున్నారో అర్ధం అవుతుంది. ఈ పుష్కరాలకు రాబోయే ప్రజలకి వీలయినంత సౌకర్యంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం కల్పించి పుష్కరాలను ఎంతో గొప్పగా జయప్రదంగా నిర్వహించాలని ఆయన గత నెలరోజులుగా అహర్నిశలు పనిచేస్తూ అధికారులను, మంత్రులను కూడా పరుగులెత్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదంతా ఆయన తన వ్యక్తిగత ప్రచారం కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఆయన ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతలను వేరొకరికి అప్పగించి ఉంటే, అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని నిందించకమానవు.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారి ఒక్కొక్క కుటుంబానికి ఆయన రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే, మనుషుల ప్రాణాలకు ఆయన వెలకడుతున్నరంటూ దానినీ వారు తప్పుపడుతున్నారు. మళ్ళీ వాళ్ళే కనీసం రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి దానినీ తప్పు పడుతున్నారు. ఒకవేళ వేయకపోయుంటే అప్పుడూ ఆయన తప్పుపట్టేవారే. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూసే ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనకు ఆయనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాయి. కానీ ఇటువంటి కీలక సమయంలో పుష్కరాలకు తరలివస్తున్న ప్రజలకు దైర్యం కల్పించి వారికి అండగా నిలువవలసిన ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయడం శోచనీయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
పుష్కర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుష్కర ఘడియలు ఆరంభం కాక మునుపే ఆయన కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని వైకాపా నేతల వాదన. చంద్రబాబు వి.ఐ.పి. ఘాట్ లో పుష్కర స్నానం చేయకుండా కోటగుమ్మం ఘాట్ లో స్నానం చేయడం వలననే ఈ దుర్ఘటన జరిగిందని జగన్ వాదిస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష నేతలు తమ మేధాశక్తికి పదునుబెట్టి రకరకాల కారణాలు వెతికిపట్టుకొని చెప్పడం చూస్తుంటే బోడి గుండుకి మోకాలుకీ ముడేసినట్లుగా ఉంది తప్ప ఈ సమస్యకు అసలు కారణాలను వివరిస్తున్నట్లు లేదు. వారు తమ ఈ మేధాశక్తిని, తర్కాన్ని పుష్కరాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు ఉపయోగించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.
అధికార, ప్రతిపక్ష రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు, పుష్కర నిర్వాహకులు విఫలమయ్యారు కనుకనే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం అవుతోంది. కానీ అందుకు పూర్తిగా వారినే బాధ్యులని చేయడం కూడా సరికాదు. ఎందుకంటే పుష్కరాలు మొదలయిన మొదటిరోజే రాజమండ్రిలోకి ఏకంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు ప్రవేశించారు. అంటే అప్పటికే నిండుగా ఉన్న ఆ పట్టణంలోకి మరో పట్టణానికి సరిపోయేంత మంది ప్రజలు ఒకేసారి ప్రవేశించినట్లయింది. మొదటిరోజే అంతమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించ లేకపోయింది. కనుకనే విఫలమయింది. కానీ ఈ దుర్ఘటన జరిగిన తరువాత పుష్కర నిర్వాహకులు, ప్రభుత్వం చేతులెత్తేయకుండా తక్షణమే మరింత విస్త్రుతమయిన ఏర్పాట్లు చేయడంతో రెండవరోజున కూడా ఇంచుమించు అంతే మంది ప్రజలు వచ్చినా పుష్కరాలు చాలా సజావుగా సాగిపోతున్నాయి. కనుక ఈ పుష్కరాలు పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు ప్రజలలో ఎటువంటి ఆందోళన రేకెత్తించకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తే బాగుంటుంది. ఆ తరువాత వారు అధికార పార్టీతో, ప్రభుత్వంతో ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండబోదు.