స్కూలుబస్సులు కండీషన్ మళ్లీ మామూలే!
posted on Oct 31, 2012 8:08AM
షిర్డీలో ప్రైవేటుట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదం జరిగినప్పుడు రవాణాశాఖాధికారులకు ఉన్న స్పీడు మళ్లీ తగ్గింది. ఎందుకంటే ఆ సంఘటనను ప్రజలు మరిచిపోయి ఉంటారని వారికి నమ్మకం కుదిరింది. అందుకని గత రెండు నెలలుగా దాడులు తగ్గించేశారు. దీంతో ట్రావెల్స్ ఏజెన్సీలూ రెచ్చిపోతున్నాయి. అప్పట్లోనే స్కూలు బస్సుల కండీషనుపై దృష్టిసారించిన రవాణాశాఖాధికారులు మళ్లీ పాతబస్సులు తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. నడవలేక నడుస్తున్నట్లుండే బస్సులను స్కూలు యాజమాన్యాలు ఎంపిక చేసినా రవాణాశాఖాధికారులు ఎటువంటి అభ్యంతరాలు చెప్పటం లేదు. పైగా కండీషనులో లేని బస్సులను బాగా కండీషనులో ఉన్నట్లు చూపుతున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు గుప్పుమన్నాయి. మొన్నటిదాకా సీజ్ చేసిన స్కూలు బస్సులను కూడా వదిలేశారని తెలుస్తోంది. రవాణాశాఖ కార్యాలయానికి ఎవరు వెళ్లినా అన్నీ కంప్యూటరైజ్ చేశాం ఎటువంటి లోపమూ లేదని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి ఆమ్యామ్యాలను వదలకుండా రవాణాశాఖాధికారులు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు స్కూలు యాజమానులు ‘తెలుగువన్.కామ్’కు స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సంఘటన చూస్తే కండీషను లేని వాహనాల వల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో అర్ధమవుతోంది. గుంటూరుజిల్లా రేపల్లెలో అడవిపొలం వద్ద స్కూలు బస్సు అదుపుతప్పి పొలాల్లో దూసుకువెళ్లింది. ఈ ప్రమాదం ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.