ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలపై విమర్శలా?
posted on Nov 12, 2015 @ 11:16AM
ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీయాత్రలు చేయడంపై ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో పర్యటించేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు సరికొత్త వాదనలు వినిపిస్తున్నారు. బిహార్ లో పరాజయం కారణంగా వస్తున్న విమర్శల బారి నుంచి తప్పించుకొనేందుకే ఆయన బ్రిటన్ పర్యటన పెట్టుకొన్నారని కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఎద్దేవా చేస్తుంటే, బిహార్ లో పోగొట్టుకొన్న ప్రతిష్టని బ్రిటన్ లో తిరిగి సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనలను లోతుగా పరిశీలిస్తే వాటిలో డొల్లతనం అర్ధం అవుతుంది.
ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటనలు అప్పటికప్పుడు ఖరారు అయ్యేవేమీ కాదు. వాటి కోసం ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు కనీసం ఒకటి రెండు నెలల ముందు నుంచే చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాగే ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా ఆయన కార్యక్రమాల అజెండాను కూడా చాలా ముందుగానే ఖరారు చేసి, అందుకు అవసరమయిన ముందస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.
ఈసారి మోడీ బ్రిటన్ పర్యటనలో వెంబ్లే స్టేడియంలో సుమారు 60, 000 మంది ప్రవాస భారతీయులు హాజరవ్వబోయే సభలో ప్రసంగిస్తారు. బ్రిటన్ లో జాగ్వార్-ల్యాండ్ రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు. బ్రిటన్ పార్లమెంటు ఉభయసభలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోడి పర్యటనలో రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరుగుతాయి. ప్రధాని పర్యటన షెడ్యూల్, అందులో ఆయన పాల్గొనబోయే ఈ కార్యక్రమాలన్నిటికీ చాలా ముందు నుంచే ఏర్పాట్లు చేయబడ్డాయి తప్ప బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినా మరునాడు చేసినవి కావు. ఒకవేళ బిహార్ లో బీజేపీ ఘన విజయం సాధించినా కూడా ఆయన తప్పకుండా బ్రిటన్ వెళ్ళేవారు..ఈ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనేవారు. అటువంటప్పుడు బిహార్ పరాజయం కారణంగా తనపై వస్తున్న విమర్శల నుండి తప్పించుకోనేందుకే ఆయన విదేశీ పర్యటన పెట్టుకొన్నారని వాదించడం ఎంత అవివేకమో అర్ధమవుతుంది.
ఇక బిహార్ లో పోయిన ప్రతిష్టను బ్రిటన్ లో తిరిగి సంపాదించుకోవడమనే వాదన కూడా అర్ధరహితమే. మోడీ ఇంతకు ముందు చాలాసార్లు విదేశీ పర్యటనలు చేసారు, ఇక ముందు కూడా చేస్తారు. ఆ సందర్భంగా ఆయన అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి చాలా ఉత్తేజపూర్వకమయిన ప్రసంగాలు చేసేవారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అందులో కొత్తగా చేస్తున్నదేమి లేదు. కనుక బిహార్ ఎన్నికల పరాజయానికి ఆయన విదేశీ పర్యటనలకి ముడిపెట్టి చూడటం చాలా అవివేకం అర్ధరహితమే. ప్రధాని నరేంద్ర మోడి తరచూ విదేశీ పర్యటనలు చేయడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన స్వదేశంలో తక్కువ విదేశాలలో ఎక్కువగా పర్యటనలు చేస్తుండటం వలననే ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పవచ్చును. కనుక బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పవచ్చును.
ఇంతకు ముందు యూపియే హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు, అవినీతి కారణంగా ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కోల్పోయిన పరువు ప్రతిష్టలను, మోడీ చేస్తున్న విదేశీ పర్యటనల వలన పునరుద్దరించబడుతోంది. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరుగుతోంది. అలాగే భారత్ శక్తి సామర్ధ్యాలను, దేశంలో విస్తృతంగా ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచ దేశాలు గుర్తించడం మొదలుపెట్టాయి. భారత్ లో ప్రభుత్వ పనితీరులో కూడా పారదర్శకత, వేగం పెరిగి అవినీతి అదుపులోకి వస్తున్న సంగతిని విదేశీ పెట్టుబడుదారులు సైతం అంగీకరిస్తున్నారు. వ్యాపారానికి అనుకూలమయిన దేశాలకు ప్రపంచ బ్యాంక్ ప్రతీ ఏట ఇచ్చే ర్యాకింగ్ లో భారత్ 140 స్థానం నుంచి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే 132వ స్థానానికి చేరుకోవడమే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అందుకే విదేశీ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాలు మోడీని విమర్శిస్తున్న వారితో సహా అందరికీ తెలుసు. అయినా ఏదో ఒక వంకతో విమర్శించడం కోసమే విమర్శిస్తున్నారని భావించవలసి ఉంటుంది.