ఆ ఒక్కటీ అడక్కు!
posted on Oct 23, 2015 @ 10:21AM
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన జరగడం చాలా సంతోషం. ఆయన శంఖుస్థాపన కోసం పార్లమెంటు వద్ద నుండి పుట్టమన్ను, యమునా నది నుండి నీళ్ళు గుర్తుకు పెట్టుకొని తీసుకువచ్చినందుకు ఇంకా సంతోషం. అయితే రాష్ట్ర ప్రజలు ఆయన నుంచి ఆశిస్తున్నది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి. ఆ రెండు ముక్కలు ఆయన నోట వినాలని ప్రజలు ఆశ పడ్డారు. ఒకవేళ ఆయనకి ఆ విషయం గుర్తుందో లేదో...అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఇదివరకు తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసారు. అయినప్పటికీ ఆ రెండింటి గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆయన చాలా అనర్గళంగా ప్రసంగించారు.
ప్రత్యేక హోదా రాదనే సంగతి ఇప్పటికే స్పష్టం అయింది కనుక ప్రజలు అందుకు నిరాశపడి ఉండకపోవచ్చును. బీహార్ రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తారని ప్రజలు చాలా ఆశగా ఎదురుచూసారు కానీ ప్రధాని మోడీ ఆ ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు కానీ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారో అర్ధం కావడం లేదు.
గత ప్రభుత్వం రాష్ట్రాలను చాలా చిన్న చూపు చూసేదని మోడీ ఆరోపించారు. నిజమే... కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తనను దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకొని మోసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల చాలా చిన్న చూపు ఉండేది. అందుకు అది తగిన ఫలితం అనుభవిస్తోంది. అయితే బీహార్ రాష్ట్రానికి అడగకుండానే రూ.1.65 లక్షల కోట్లు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అందరూ ముక్త కంఠంతో రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, హోదా కావాలని ఎంతగా బ్రతిమాలుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు? కనీసం వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన కూడా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అని ప్రజలు అడుగుతున్నారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఉండి ఉండవచ్చును. అయితే ఇటువంటి విషయాలలో మౌనం వహించడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలని, మనోభావాలని పట్టించుకోవడం లేదనే ఒక దురాభిప్రాయం ప్రజలలో ఏర్పడుతుంది. ప్రజలలో ఏర్పడిన ఈ అసంతృప్తిని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేయడం తధ్యం. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకపోవడం వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందో లేదో తెలియదు కానీ ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీల వైపు ఆకర్షితులయితే దాని వలన తెదేపా, బీజేపీలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అప్పుడు వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఎటువంటి వాగ్దానాలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మకపోవచ్చును. అంటే అప్పుడు ప్రజలను మెప్పించి వారి ఓట్లు పొందడం ఇంకా కష్టం అవుతుందన్న మాట. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రధాని నరేంద్ర మోడీకి ఈవిషయం తెలియదనుకోలేము. అయినా ప్రజాభీష్టాన్ని, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రయత్నాలని ఎందుకు పట్టించుకోవడం లేదో వారికే తెలియాలి.