గాలికిపోయే పదవి ‘కృష్ణా’ర్పణం
posted on Oct 27, 2012 @ 12:10PM
ప్రధాని మన్మోహన్‌సింగ్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం నిర్ణయించిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పదవికి రాజీనామా చేశారు. కర్నాటకలో భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న లోకాయుక్త నుంచి పిలుపు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా ఎస్.ఎం.కృష్ణ బిల్డప్ ఇచ్చారు. అయితే గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్న చందంగా వుంది ఆయన రాజీనామా వ్యవహారం. కేబినెట్‌లో ఈసారి జరుగుతున్న మార్పులు చేర్పులన్నీ 2014 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేసేందుకు ఉద్దేశించినవే. కేబినెట్ మంత్రులు పలువురిని పదవులనుంచి తొలగించి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం వుంది. ఎస్.ఎం.కృష్ణను కూడా అదే విధంగా తొలగించే ఆలోచనతో వుంది. కర్నాటక పిసిసి బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం వుంది. బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకుంటుండడంతో ఆయన జోరును తగ్గించడానికి కృష్ణను కర్నాటకకు పంపించాలన్నది హైకమాండ్ యోచన. ఇదిలా వుండగా, పార్టీ బాధ్యతలను అప్పగించడానికి అధిష్టానం ఎంపిక చేసిన మరో ఇద్దరు కేంద్ర మంత్రులు అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్‌లు కూడా రాజీనామా పత్రాలు పట్టుకొని తిరుగుతున్నారు.