Read more!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన డిసెంబర్ 4న

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే డిసెంబర్  4న విశాఖలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా జరగనున్న నేవీ డే విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అనంతరం పలు కీలక ప్రాజెక్టులను ఆమె వర్చువల్ గా ప్రారంభించనున్నారు.  రాష్ట్రపతి భవన్ సెక్రటేరియెట్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం  దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ము  డిసెంబర్ 4 మధ్యాహ్నం 2.15 గంటలకు  గన్నవరం చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళతారు.   3.25 గంటలకు విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్  ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి 3.35 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు . అనంతరం 4.05 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని నేవీ డే విన్యాసాలను ప్రారంభిస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలకు చెందిన మరికొన్ని ప్రాజెక్టులను రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

తరువాత సాయంత్రం 6.10 నిముషాలకు తూర్పునౌకాదళ అనంతగిరి కేంద్రానికి చేరుకుని నేవీడే రిసెప్షన్ లో పాల్గొంటారు.  రాత్రి  8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరతారు. రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇలా ఉండగా రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకురావడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా ఆమె విశాఖలో రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..  

రక్షణ శాఖ  కర్నూలులో నిర్మించిన నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ (ఎన్‌వోఏఆర్‌), నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్‌డ్‌ నైట్‌విజన్‌ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎన్‌హెచ్‌-340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే, ఎన్‌హెచ్‌-205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్‌వోబీ, ఎన్‌హెచ్‌-44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరులైన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ స్ట్రక్చర్, స్లిప్‌రోడ్స్, డోన్‌ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లు, రహదారులు ,గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, సైన్స్‌ సెంటర్‌లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌-342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.