హిందు, ముస్లింల కాళ్లు కడిగిన పోప్
posted on Mar 25, 2016 @ 3:36PM
ఒక పక్క బెల్జియంలో జరిగిన ఉగ్రదాడితో యూరోప్ అంతటా విస్తుపోయి ఉండవచ్చు. ఈ దాడుల తరువాత ముస్లింల మీద అక్కడి ప్రజలలో ద్వేషభావం మరింతగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు! మతాల మధ్య ఇలాంటి ద్వేషభావం పెరిగిపోవడం మంచిది కాదనుకున్నారో ఏమో, పోప్ ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. గుడ్ ఫ్రైడేకి ముందు రోజున జరిగే ఓ కార్యక్రమంలో ఆయన వేర్వేరు మతాల వారి కాళ్లు కడిగి, వాటిని ముద్దు పెట్టుకున్నారు. సాధారణంగా తనను శిలువ వేయడానికి ముందర, క్రీస్తు తన 12 మంది శిష్యుల కాళ్లు కడిగారట.
ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ, పోప్ ఏటా 12 మంది కాళ్లు కడగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే క్యాథలిక్ మతానికి చెందిన పురుషులను మాత్రమే ఇందుకోసం ఎంపిక చేసేవారు. కానీ 2013లో పోప్ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్... స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్‌లను, ముసల్మానులను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చుకున్నారు పోప్. ‘మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం’ అంటూ ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు పోప్!