ఇంక కోర్టులూ, తీర్పులు ఎందుకు?
posted on Jun 16, 2015 @ 9:44AM
ఓటుకు నోటు వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారందరూ కోర్టులు, విచారణలతో సంబంధం లేకుండా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోషి అని ఖరారు చేస్తుండటమే కాకుండా ఆయనకి జైలు శిక్షని ఖరారు చేస్తూ తీర్పులు కూడా చెప్పేస్తున్నారు. ఆయనతో బాటు ఇంకా ఎంతమంది దోషులున్నారో, ఎవరెవరు దోషులో, వారిలో ఎవరెవరికి ఎటువంటి శిక్షలుపడాలో కూడా వారే డిసైడ్ చేసేస్తున్నారు. అటువంటప్పుడు ఇక దేశంలో కోర్టులు, ఎసిబిలు, విచారణలు, పరిశోధనలు, సాక్షులు ఏవీ కూడా అవసరమే లేదు. వారందరి తీరు చూస్తుంటే తమ రాజకీయ ప్రత్యర్ధుల తప్పొప్పుల లెక్కలను తామే సరిచూసి, తమకు నచ్చినట్లు తామే శిక్షలు విధించే సౌలభ్యం ఉంటే బాగుంటుందని కోరుకొంటున్నట్లుంది. అయితే అటువంటివి రాజరిక వ్యవస్థలోనే సాధ్యమవుతాయని వారికీ తెలుసు.
ఇప్పుడు శ్రీరంగనీతులు చెపుతున్న రాజకీయ నాయకులందరి చరిత్రలు ప్రజలకు చాలా బాగా తెలుసు. అయితే కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భావిస్తున్నట్లుగానే వారు కూడా తమ నిర్వాకాలని ప్రజలెవరూ గమనించడంలేదని భావిస్తున్నట్లున్నారు. అందుకే వారు అంత దైర్యంగా మీడియా ముందుకు వచ్చి మరీ శ్రీరంగనీతులు వల్లిస్తున్నారు. ఇక మరికొందరయితే అప్పుడే తెదేపా, బీజేపీ బంధాలు తెగిపోయినట్లు, ఎన్డీయే కూటమిలో, మోడీ ప్రభుత్వంలో తెదేపా స్థానాన్ని తాము భర్తీ చేయబోతున్నట్లు కలలుకంటూ అప్పుడే ఊహాలోకంలో తేలిపోతున్నారు. కాంగ్రెస్, వైకాంగ్రెస్, తెరాస పార్టీలయితే చంద్రబాబు నాయుడు స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలో కూడా నిర్ణయించేసాయి.
అయితే ఎసిబి అధికారులు ఇంకా తమకు ఫోరెన్స్ ల్యాబ్ నుండి నివేదిక రాలేదని, అందువల్ల తమ పరిశోధన ఇంకా పూర్తి కాలేదని కోర్టుకి చెప్పడంతో రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మరొక రెండు వారాలు పొడిగించడాన్ని వారెవరూ పట్టించుకోవడం లేదు. అంటే ఎసిబి తన పరిశోధన పూర్తి చేయకముందే, ఇంకా కోర్టు తీర్పు చెప్పకముందే అంతవరకు ఆగలేని వైకాపా, కాంగ్రెస్, తెరాసలు చంద్రబాబు నాయుడుతో సహా చాలా మందిని దోషులుగా ఖరారు చేసేసి వారికి ఏమి శిక్షలు వేయాలో కూడా ప్రకటించేస్తున్నాయి. కానీ వారందరూ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే వారు అవినీతిని వ్యతిరేకిస్తున్నారని కాదు, తమ రాజకీయ ప్రత్యర్ధి తెదేపా ఇటువంటి సంకట పరిస్థితిలో ఇరుకొని విలవిలలాడుతుంటే, పైశాచిక ఆనందంతోనే దానిపై మరో నాలుగు రాళ్ళు విసురుతున్నారని చెప్పవచ్చును.
కానీ వారు రాజకీయాలను ఇంకా ఎంతకు దిగజార్చుకొంటే దాని వల్ల వారికే ప్రమాదం ఉంటుందని గ్రహించలేకపొతున్నారు. తాము పెంచి పోషిస్తున్న భయంకరమయిన విషసర్పం వంటి ఈ నీచవికృత రాజకీయాలకు నేడు కాకపోతే ఏదో ఒకనాడు తామూ బలయ్యే ప్రమాదం ఉంటుందనే సత్యాన్ని రాజకీయనేతలు, పార్టీలు గ్రహించకుండా వికృత రాజకీయ క్రీడలలో మునిగితేలుతున్నారు. వాటి గురించి ప్రజలు చర్చించుకొంటున్నారంటే దానర్ధం వాటికి ప్రజామోదం ఉందని కాదని వారు గ్రహించడం మంచిది.