Read more!

రాహుల్ వేషం పై రాజకీయ రగడ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. సరే  రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న యువనేత సచిన్ పైలట్ వర్గాల మధ్య ‘ప్రత్యక్ష’ యుద్ధం జరుగతున్ననేపథ్యంలో రాహుల్ యాత్ర ఎలా ముందుకు సాగుతుంది, అనే విషయంలో వినిపిస్తున్న, ఉహాగానాలు,విశ్లేషణలను పక్కన పెడితే, ప్రస్తుతం మధ్య ప్రదేశ్, రాహుల్ యాత్ర చాలా చాలా  హుషారుగా సాగుతోంది. రాహుల్ యాత్రలో సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, ఆమె భర్త భర్త రాబర్ట్  వాద్రా, కుమారుడు రేహాన్ వరసగా మూడు రోజులు పాల్గొనడంతో,రాహుల్ యాత్రకు కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా ప్రియాంక వెంట, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్ కూడా రావడంతో రాజకీయంగాను కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. 

రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, సైద్ధాంతిక పోరాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం కూడా ఎన్నికల విజయం కాదని, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సహా ఇతర నాయకులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. రాహుల గాంధీ కూడా తమ ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్ జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను ప్రస్తావిస్తూ హెచ్చరిస్తున్నారు. 

ఈనేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఇంత వరకు గాంధీలు పోషించిన పాత్రను ఇకపై వాద్రాలు పోషిస్తారని, అందుకే ప్రియాంక కుటుంబ సమేతంగా యాత్రలో పాల్గొన్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. రాహుల్ గాంధీ యాత్ర తర్వాత కూడా, ఇదే ధోరణి అవలంబిస్తే ప్రియాంక, రాబర్ట్ వాద్రా పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకుంటారని అంటున్నారు. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాలపై కొంత ఆసక్తి చూపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రకటించిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. 

అదలా ఉంటే, రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్‌  యాత్రలో వేష ధారణ మారిపోయింది. గతంలోనే,నేనూ హిందువునే అని ప్రకటించుకున్న రాహుల గాంధీ,. ఈసారి ఏకంగా పక్కాగా పండిత వేష కట్టారు. ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో  రాహుల్ ఓంకార ముద్రలున్న శాలువా కప్పుకుని, రుద్రాక్ష మాలలు ధరించి, పెద్ద పెద్ద బొట్లతో అచ్చమైన పూజారికి రోల్ మోడల్ అన్నట్లు వేషం కట్టారు. పండితునిగా దర్శనమిచ్చారు. ఆ  ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

నిజానికి, రాహుల్ వేషం పై సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకున్నారు. ట్రోల్ చేసిన వారు ట్రోల్ చేశారు. అదంతా ఒకెత్తు అయితే, రాహుల్ పోస్ట్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీట్వీట్ చేస్తూ చేసిన వ్యాఖ్య  వివాదంగా  మారింది. అలాగే, అంతకు ముందు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ,రాహుల్ వేషధారణలో వచ్చిన మార్పును మెచ్చుకుంటూనే,  గడ్డం పెంచిన రాహుల్ గాంధీని చూడగానే సద్దామ్ హుస్సేన్‌ గుర్తుకు వస్తున్నారని  ట్రోల్ చేశారు. అది మరొక వివాదం అయింది .

ఇప్పుడు కాంగ్రెస్, బీజేపే నాయకుల మధ్య రాహుల్ గాంధీ కొత్త వేషం పై హాట్ హాట్ గా  వివాదం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కేంద్ర మంత్రి హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. అలాగే, మరో కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుంది  

అని ఆమె స్మృతీ ఇరానీకి సుతిమెత్తగా చురకలు అంటించారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిమంత శర్మ రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు, హిమంత శర్మ సిగ్గు పడాలి. ఇప్పుడు ఆయన( హేమంత్ బిశ్వ శర్మ రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే అదంతా రాహుల్ గాంధీ పుణ్యమేనని గుర్తుంచుకోవాలి అని ట్వీట్ చేశారు. ఇలా రాహుల్ గాంధీ సాగిస్తున్న బారత్ జోడో యాత్ర,ఓ వంక రాజకీయ వేడిని పుట్టిస్తోంది, మరో వంక సైద్ధాంతిక చర్చలకు ఆస్కారం కలిపిస్తోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీలో రేపటి మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.