Read more!

గతుకుల బాటలో పవన్ రాజకీయ ప్రస్థానం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా ఒక విలక్షణ రాజకీయ వేత్త. సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయనకు ఇప్పటికీ ఆ సినిమాటిక్ ట్విస్టులు, మలుపులపై మోజు పోలేదు. అందుకే ఆయన తన రాజకీయ గమనంలో రోజుకో ట్విస్టులు తెరమీదకు తెస్తూ ఉంటారు. ఆ ట్విస్టులు ప్రజలనే కాదు.. చాలా సందర్భాలలో పార్టీ శ్రేణులనూ అయోమయానికి గురి చేస్తుంటాయి. ఒక సినిమా హీరోగా  పవన్ కల్యాణ్ కు అశేష అభిమాన బలం ఉందనడంలో సందేహం లేదు.

ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఆ అభిమాన బలమే ఒక ప్రధాన కారణమని కూడా చెప్పాలి. అయితే సినీ ప్రేక్షకాభిమాన బలం రాజకీయ నాయకుడిగా ఆయనకు దన్నుగా నిలుస్తుందా అంటే ఒకింత సందేహమే. రాజకీయాలలో కాలు పెట్టేందుకు సినీ అభిమానం దోహదపడుతుందే తప్ప.. రాజకీయాలలో నిలదొక్కుకునేందుకు, అధికార అందలం ఎక్కడానికి అదొక్కటే సరిపోతుందా అంటే మాత్రం కచ్చితంగా కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన వ్యవహార శైలి, ప్రసంగాలు, వాగ్దానాలు అన్నిటినీ రాజకీయ వర్గాలే కాదు.. సామాన్య జనం కూడా నిశితంగా గమనిస్తున్నారు. 

నిజమే ఆయన అడుగు బయట పెడితే.. నేల ఈనిందా అన్న స్థాయిలో కాకపోయినా.. భారీగానే జనం వస్తుంటారు. అయితే అది ఆయన జనసేన పార్టీకి దన్నుగా నిలిచే  పరిస్థితి ఉందా అంటే మాత్రం అనుమానమే అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి కర్త, క్రియ, కర్మ ఆయనే. ఆయన అడుగు బయటకు వేస్తేనే జనం.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే జనం.. అంతే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో జనసేన పార్టీ ఉందా? లేదా అనే పరిస్థితే ఉంటుంది. జనసేన పార్టీకి బలం, బలహీనతా కూడా పవన్ కల్యాణే.  

ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన స్పందనలన్నీ సినిమాటిక్ గానే ఉంటాయి. సున్నిత మనస్థత్వం, పట్టలేని ఆగ్రహం, చిన్నపిల్లాడిలా అలక, అంతలోనే సంతోషం ఇలా ఒక్కో సారి ఒక్కో తీరుగా ఆయన బుహుముఖాలుగా జనానికి దర్శనమిస్తుంటారు. అధికారం మనదే అని ఒకసారి.. తన రాజకీయ ప్రస్థానం అధికారం కోసం కాదని మరోసారి.. ప్రశ్నిస్తానే తప్ప సమాధానాలు తన వద్ద లేవని ఇంకో సారి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తన కన్ఫ్యూజన్ ను జనంపై రుద్దుతారు.  కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచపు బాధ శ్రీశ్రీది' అన్నట్లుగా రాజకీయాలలో పవన్ కల్యాణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి పాత్ర పోషిస్తున్నారా అనిపించక మానదు.

ప్రతి విషయానికీ విపరీతంగా కదిలిపోయి.. వైరాగ్యపు మాటలు మాట్లాడటం.. అంతలోనే పట్టరాని ఆవేశంతో రగిలిపోయి.. చెప్పులు చూపించడం.. పరుష పదజాలంతో రెచ్చిపోవడం.. మళ్లీ కొంత కాలం మౌనంగా మిగిలిపోవడం. ఆ కారణంగానే ఇంతటి ప్రజాభిమానం ఉండి కూడా 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో విజయం సాధించడానికే పరిమితమైంది. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పవన్ కల్యాణ్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సన్నద్ధమౌతున్న తరుణంలోనూ జనసేనానిలో అదే కన్ఫ్యూజన్..

రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పొత్తుల చర్చకు తెరలేపింది పవన్ కల్యాణే. రాష్ట్రంలో జగన్ దుష్ట పాలనను అంతమొందించడానికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ప్రకటించారు. అక్కడితో ఊరుకోకుండా ఈ విషయంలో తానే స్వయంగా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడతాను అంటూ పొత్తు చర్చలకు తెరతీశారు. ఇప్పుడు ఆయనే స్వయంగా మళ్లీ ఒంటరి పోరు అంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు కారణమౌతున్నారు. వాస్తవానికి పార్టీ నిర్మాణం, నియోజకవర్గ స్థాయి నేతలూ లేకుండానే జనసేన పార్టీ గత ఎనిమిది నెలలుగా నెట్టుకు వస్తోంది. ఇప్పటికీ అదే సరిస్థితి.  

ఆ పార్టీకి బలం బలహీనతా కూడా పవన్ కల్యాణే అవ్వడానికి అదే కారణం. ఇప్పటికీ జనసేనా పార్టీకి రాజూ పవన్ కల్యానే.. సేవకుడూ పవన్ కల్యాణే.  తెలుగు రాష్ట్రాలలో ఎందరో సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టారు. స్వయంగా పవన్ కల్యాణ్ సొదరుడు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఒక్క ఎన్నికతోనే రాజకీయ తత్వం బోధపడి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేవారు. అప్పుడు చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ కల్యాణ్ అయినా రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సేవలో తరించాలన్న నిర్ణయం తీసుకోవడానికి స్ఫూర్తి మాత్రం తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు. అయితే ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో  పార్టీ స్థాపించిన 9 నెలలోనే పార్టీని విజయపథంలో నడిపించడానికి ఆయన పకడ్బందీగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టడమే కారణం.

అయితే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండా కేవలం సినీ గ్లామర్ తోనే గెలిచేయగలం అనుకుంటే అలా గెలిపించడానికి జనం సిద్ధంగా లేరని పలు మార్లు ఇప్పటికే రుజువైంది.  పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ జనసేనకు క్షేత్ర స్థాయిలో నిర్మాణం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులను గుర్తించిన పరిస్థితి లేదు.  ఇక పార్టీలో పవన్ కల్యాణ్ తప్ప జనం గుర్తు పెట్టగలిగే నాయకుడు మరొకరు కనిపించరు. ఇటీవల ఇప్పటం విషయంలో పవన్ వ్యవహరించిన తీరు బూమరాంగ్ అయ్యింది. ఇందుకు పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వత, అతి ఆవేశమే కారణం.

ఇక అన్నిటికీ మించి అదేదో సినిమాలో వీకెండ్ ఫార్మింగ్ అన్నట్లు పవన్ కల్యాణ్ లీజర్ టైం పాలిటిక్స్ చేస్తున్నారన్న భావన జనసేన శ్రేణుల్లోనే వ్యక్త మౌతోంది. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటూ ఖాళీ సమయాల్లో జనసేన కార్యక్రమాలు చేపడుతున్నారన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్త మౌతోంది.  ఇక జనసేన విస్తరణకు మరో పెద్ద అవరోధం ఏమిటంటే బీజేపీతో మైత్రి. అమరావతి రాజధాని నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకూ బీజేపీ తీరు పట్ల రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అటువంటి పార్టీతో మైత్రి కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ పైనా దాని ప్రభావం పడుతోంది. అలాగే.. తనను ఎంతగా విస్మరిస్తున్నా కమలాన్ని పట్టుకు పవన్ కల్యాణ్ ఎందుకు వెళాడుతున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది.

ఔను మిత్రపక్షం అంటూ జనసేనాని చెబుతుండటమే తప్ప.. ఇన్నేళ్లలో జనసేన పట్ల బీజేపీ మిత్ర ధర్మం చూపిన సంఘటన ఒక్కటీ లేదు. ఆత్మకూరు, బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ వద్దు అని జనసేనాని నిర్ణయిస్తే.. దానికి భిన్నంగా బీజేపీ ఒంటరిగా పోటీలోకి దిగింది.నడ్డా, అమిత్ షా వంటి వారు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు కనీసం మర్యాద పూర్వకంగా కూడా జనసేన అధినేతతో భేటీ కాలేదు. ఇప్పుడైనా ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో జనసేనానితో భేటీ అయ్యారంటే అందుకు కారణం.. అంతకు ముందు విశాఖలో  జనసేనానికి కదల నివ్వకుండా చేసిన వైసీపీ వైఖరిని ఎండగడుతూ.. తెలుగుదేశం అధినేత జనసేనానితో భేటీ అవ్వడం, సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటం వల్లనే అని వేరే  చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద పవన్ కల్యాణ రాజకీయ ప్రస్థానం గతుకుల బాటలో సాగుతోందనే చెప్పాలి.