పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విమర్శల వర్షం
posted on Jul 8, 2015 9:14AM
ఏడాదికో...ఆర్నెల్లకో...ఓసారి రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, మాట్లాడిన ప్రతీసారి విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై రెండు రాష్ట్రాలకి చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరికి మిత్రపక్షమయిన తెదేపా నేతల నుండి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. తెలంగాణా నేతలు, ఆయన చంద్రబాబు నాయుడుని వెనకేసుకు వచ్చేరని విమర్శిస్తుంటే, ఆంధ్రా నేతలు ఆయన హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకొనేందుకే సెక్షన్: 8ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించారని విమర్శిస్తున్నారు.
వ్యాపారవేత్తలు రాజకీయాలలోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా వ్రాసి లేదని అన్నారు కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా? అనేదే ముఖ్యం కానీ తము వ్యాపారాలు చేసుకొంటున్నామా? లేదా అనేది ముఖ్యం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవికి కూడా చాలా వ్యాపారాలున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. (ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే 150వ సినిమా చేసుకొంటున్నారిప్పుడు.)
హైదరాబాద్ లో ఆంద్ర ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష పవన్ కళ్యాణ్ కళ్ళకి కనబడటం లేదా? అని తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయించడం తప్పుగా కనబడలేదా అని తెదేపా యంపీ కొనకళ్ళ నారాయణ ప్రశ్నించారు.
ఏడాదికోసారి నిద్రలేచే ఆయనకి తామేమి చేస్తున్నామో ఎలా తెలుస్తుందని తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఇలాగ తమని విమర్శించే బదులు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి పనిచేసి చూపించమని ఆయన సవాలు విసిరారు. తామందరం పార్లమెంటులో ఏ ఏ అంశాల గురించి ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు మాట్లాడామో తెలియకపోతే పార్లమెంటు వెబ్ సైట్ ని చూడమని ఆయన సలహా ఇచ్చేరు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేదని తమను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ విషయం గురించి ఈ ఏడాది కాలంలో ఒక్కసారయినా మాట్లాడారా? అని కేశినేని నాని ప్రశ్నించారు. (తోటి నటుడు శివాజీ నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పోరాడేందుకు ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుందని శివాజీ పదేపదే విజ్ఞప్తి చేసినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు?)
అశోక్ గజపతి రాజు విజయవాడ విమానాశ్రయానికి రూ.250 కోట్లు, వైజాగ్, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధికిభారీగా నిధులు విడుదల చేసారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొణకళ్ళ నారాయణ రావు అన్నారు. దేని గురించయినా మాట్లడదలచుకొంటే బాధ్యాతయుతంగా మాట్లాడాలని కానీ ఇలా అర్ధం పర్ధం లేని విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు.
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏడాదికోసారి రిలీజ్ అయ్యే సినిమావంటిదని అంతకంటే దానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని తెలంగాణా మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై స్పందించడం అంటే తన స్థాయిని దిగజార్చుకోవడమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.
పవన్ కళ్యాణ్ తను చాలా బాధ్యతగా మాట్లాడుతానని చెప్పుకొన్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలని రెండు రాష్ట్రాలలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు సమర్ధించకపోవడం చూస్తే ఆయన పని రెంటికీ చెడిన రేవడిలా మారినట్లుంది. ఆయన ఈవిదంగా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేసి అభాసు పాలవడం కంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేదా కేశినేని నాని సూచించినట్లు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ప్రజలను మెప్పించినా మంచిదే.