Read more!

ఔను జనవరి 27 నుంచి పాదయాత్ర.. మంగళగిరి బాధ్యత ఇక మీదే.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు అదికారికంగా ధృవీకరించారు. మంగళగిరి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ విషయం ప్రకటించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర సాగుతుందన్నారు.  

మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందన్నారు. పాదయాత్ర కారణంగా తాను నియోజకవర్గానికి దాదాపు ఏడాది కాలం దూరంగా ఉంటానని లోకేష్ ఈ సందర్బంగా చెప్పారు. పార్టీకి మంగళగిరి కంచుకోటగా మారిందనీ, వచ్చే ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని లోకేష్ ఆ సందర్భంగా చెప్పారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ కుయుక్తులను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  మంగళగిరి బాధ్యతలను మీకు అప్పగించి,   రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.

ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా ఎదిగారు. అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు. 

ఇప్పడు లోకేష్ అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బాధితులకు అండగా నిలబడతారు. ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పి కొడతారు. ఆయన పర్యటనలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు.. ప్రజలకు భరోసానూ ఇస్తున్నాయి.  అతి తక్కువ సమయంలో లోకేష్ తనను తాను ఒక ప్రజానాయకుడిగా మార్చుకున్నారు.  తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లోకేష్ ఇప్పుడు ఆ ఛాయ నుంచి బయటపడి తనకంటూ సొంతంగా ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్నారు.  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికే జిల్లాల పర్యటనలతో ప్రజలలో తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఏర్పరిచారు. ఇప్పుడు దానికి మరింత ముందుకు తీసుకుపోవడానికి లోకేష్ పాదయాత్ర దోహదపడుతుందనడంలో సందేహిం లేదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడే పచ్చ కండువా కప్పుకుని జనంలోకి వచ్చి ఆ తరువాత ఇంటికే పరిమితమయ్యే కొందరు సీనియర్ నాయకుల బద్ధకాన్ని ఈ పాదయాత్ర వదిలిస్తుందని భావిస్తున్నారు. అలాగే యువతను భారీగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడానికి లోకేష్ యాత్ర ఒక కెటలిస్ట్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా తాను పాదయాత్ర ప్రారంభించే తేదీని అధికారికంగా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతున్నాయి.