Read more!

జనసేన ముందున్నది ఒకటే ఆప్షన్

సినిమాల్లో రాణించడం వేరు. రాజకీయాల్లో రాణించడం వేరు. సినిమాల్లో రాణించిన వారంతా రాజకీయాల్లో రాణించలేరు. రాణించలేదు.నిజం, రాజకీయాల్లో రాణించిన హీరోల కంటే, రాజకీయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న హీరోలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.  అందులోనూ అలాంటి ఇలాంటి హీరోలు కాదు, బాలీవుడ్’ బిగ్-బీ  అమితాబచ్చన్ మొదలు, మన మెగాస్టార్ చిరంజీవి వరకు చాలా మందే ఉన్నారు. అయితే, మనం ఇప్పడు, రాజకీయాల్లో ఫెయిల్ అయిన సినిమా హీరోల చరిత్రలోకి వెళ్ళడం లేదు. నడుస్తున్న చరిత్రలో, సినిమా హీరోగా, రాజకీయ నాయకునిగా డబుల్ రోల్ ప్లే చేస్తున్న, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ రాజకీయ భవిష్యత్ గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడు కుంటున్నాం.  

నిజం పవన్ కళ్యాణ్’ కు సినిమా హీరోగానే కాదు, రాజకీయ నాయకునిగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అందులో సందేహం లేదు. ఆయన ఎక్కడికెళితే అక్కడ అభిమానుల సందడి, అప్పుడెప్పుడో అన్న నందమూరి తారక రామా రావు అన్నటుగా, నేల ఈనిందా? ఆకాశం దద్దరిల్లిందా.. అన్నట్లుగా వేలలలో కాదు, లక్షల్లో జనం అయన సభలకు హాజరవుతున్నారు. ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఒకరని కాదు, ఒక వర్గం, ఒక కులం అని కాదు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు హరతులిస్తున్నారు. నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరే ఇతర నాయకునికి లేని జనాకర్షణ సామర్ధ్యం పవన్ కళ్యాణ్ సొంతం అంటే అతిశయోక్తి కాదు. 

అయినా, ఆయన రాజకేయాల్లో రాణిస్తారా? ఎన్నికల సంగ్రామంలో విజేతగా నిలుస్తారా, అంటే, ఇంతవరకు అయితే పవర్ స్టార, పొలిటికల్ స్క్రీన్’పై పెద్దగా ప్రభావం  చూపలేదు. గత (2019) అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసిన పవ కళ్యాణ్ రెండు చోట్లా ఒడి పోయారు. ఇక పార్టీ జనసేన సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎంతో పాటుగా బీఎస్పీతో కలిసి పోటి చేసినా, జనసేన పోటీ చేసిన 130కి పైగా స్థానాల్లో ఒక ఒక్క స్థానంలో మాత్రమే పార్టీ గెలిచింది. ఆ గెలిచిన ఒకే ఒక్కడు కూడా అధికార వైసీపీలో చేరి పోయారు.  

అయితే, అన్నీ ఉన్నా జనసేన ఎన్నికలలో ఎందుకు విజయం సాధించే లేక పోతోంది, అంటే, పార్టీ పుట్టి పుష్కరం పైగా అయినా, ఇంతవరకు పార్టీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనసేన అంటే పవన్ కళ్యాణ్ కాదంటే, నాదెండ్ల మనోహర్ ఈ ఇద్దరే నాయకులు, మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం. ఇలా ‘ఏక్  నిరంజన్’ లా పవన్ కళ్యాణ్ ఒంటరి నాయకత్వం వలన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళలేక పోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు, ఆయన వెంట కాంగ్రెస్‌ మహామహులంతా టీడీపీలో చేరారు. నాదెండ్ల, జానారెడ్డి, నల్లపురెడ్డి, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి వంటి అగ్రనేతలంతా ఎన్టీఆర్‌ వెంట నిలిచారు. నియోజకవర్గాల్లో ప్రముఖులైన డాక్టర్లు, వ్యాపారస్తులు, యువకులను గుర్తించి.. వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. టీడీపీ స్థాపించిన తర్వాత, గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు, సభ్యత్వాలు నిర్వహించారు.

చంద్రబాబు చేరిన తర్వాత కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అవే కారణాలన్నది సుస్పష్టం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 
చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీ సంఖ్యలో అగ్రనేతలు చేరారు. కేంద్రమాజీ మంత్రి శివ శంకర్‌, భూమా నాగిరెడ్డి, ఉమ్మారెడ్డి, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస్‌, ఆమంచి కృష్ణమోహన్‌, హరిరామజోగయ్య వంటి ప్రముఖులు చిరంజీవి వెంట నిలిచారు. నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌-టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు చేరడంతో క్యాడర్‌ పీఆర్పీ బలంగా కనిపించింది. ఫలితంగా 74 లక్షల ఓట్లు సాధించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

బంగారు కంచమే అయినా గోడ దాపు లేనిదే నిలవలేదు. అలాగే, ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు  నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం, బలమైన నాయకులు  అవసరం. అది లేక పోవడమే, జనసేనకు శాపం. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్’ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి.అంతే కాదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే  వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు. సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అయితే, బీజేపీ తోక వదిలి సైకిల్ ఎక్కడం ఒక్కటే పవన్ ముందున్న మార్గమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.