పాతబస్తీ గరం గరం!
posted on Nov 6, 2012 @ 10:12AM
హైదరాబాద్ పాత నగరం మళ్లీ వేడెక్కింది. రాత్రి వేళల్లో అల్లరి మూకల ఆగడాలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తొమ్మిది గంటలు కాగానే పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అల్లరి మూకల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. ఈ మూకలు చేసిన రాళ్ల దాడిలో పోలీస్ వాహనాలు, ఎటిఎమ్ లు ధ్వంసమయ్యాయి. చార్మినార్, శాలిబండ, హరిబౌలి, మొఘల్ పురా ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన జనం పెద్దఎత్తున రోడ్లమీదికి రావడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొంటోంది.
వివాదాల్లో ఉన్న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం షెడ్డు నిర్మాణం పనుల్ని చేపట్టేందుకు విహెచ్ పి నాయకులు వస్తున్నారంటూ పెద్దఎత్తున జరిగిన ప్రచారం గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీస్తోంది. దీనికి సంబంధించి ఓ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రహస్య సమావేశాలుకూడా జరిపారు.
అల్లరిమూకల అరాచకం ఎక్కువైపోయిందని, రాత్రిళ్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పడుకోవాల్సొస్తోందని పాతబస్తీ ప్రజలు వాపోతున్నారు. టాస్క్ ఫోర్స్ తోపాటు అదనపు బలగాలుకూడా రంగంలోకి దిగడంతో కాస్త ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది.