Read more!

హిమాచల్ లో ఆప్ కంటే నోటాకే ఓట్లెక్కువ!

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగితేలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పంటికింద రాయిలా మారాయి. హిమాచల్ లో ఆప్ పరాజయం ఘోరం కాదు అంతకు మించి. ఆ రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలోనూ ఆప్ డిపాజిట్లు కోల్పోయింది.

రాష్ట్రం మొత్తంలో ఆప్ కు వచ్చిన ఓట్లు కేవలం 1.10 శాతం మాత్రమే. హిమాచల్ లోని పలు నియోజకవర్గాలలో ఆప్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికం. దీనిని బట్టే హిమాచల్ ఓటర్లు ఆప్ ను ఏ స్థాయిలో తిరస్కరించారో అర్ధమౌతుంది. హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశలు పెంచుకున్న ఆప్ కు ఈ ఫలితాలు ఆశనిపాతమనే చెప్పాలి. హిమాచల్ లో ఆప్ ఈ స్థాయిలో విఫలం కావడానికి పార్టీ నాయకత్వం రాష్ట్రం మీద పెద్దగా దృష్టి సారించకపోవడమే కారణమని చెబుతున్నారు.

దృష్టి సారించలేని చోట, అసలు స్టేకే లేని చోట ఆప్ పోటీ ఫలితాలను ప్రభావితం చేయడానికే పరిమితమైందని అంటున్నారు. హిమాచల్ ను వదిలేసి పూర్తిగా గుజరాత్ పైనే ఆప్ అధినాయకత్వం దృష్టి సారించింది.

పోనీ అక్కడైన ఫలితాలు మెరుగ్గా సాధించిందా అంటే.. కేవలం కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ కొట్టడానికి మాత్రమే గుజరాత్ లో ఆప్ పరిమితమైందని పరిశీలకులు అంటున్నారు. గుజరాత్ లో ఆప్ పోటీ వల్ల బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడానికి మాత్రమే దోహదపడింది.