లోకేశ్ ను.. రాహుల్ లా కాదు కేటీఆర్ లా తీసుకురావాలి
posted on Apr 5, 2016 @ 11:53AM
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లోకేశ్ గతంలో కంటే ఇప్పుడు కాస్త బెటరే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా లోకేశ్ ను ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు కూడా చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జూన్ నెలలో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో అప్పుడు లోకేశ్ ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇదిలా ఉండగా లోకేశ్ రాకపై టీడీపీ నేతలు బాబుకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన తప్పిదాన్ని లోకేష్ విషయంలో జరగకుండా చూడాలని కొందరు పార్టీ సీనియర్లు సీఎం చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎందుంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అంతంగా పట్టించుకోలేదని.. అధికారపీఠానికి కాస్త దూరంగా ఉన్నారని.. అలా కాకుండా ముందే నుండే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండి ఉంటే రాహుల్ రాజకీయ స్థాయి పెరిగి ఉండేదని.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు అధికార బాధ్యతలు చేపడితే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు కేసీఆర్.. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా తన కొడుకు, కూతురు, మేనల్లుడిని ముందు నుండే ప్రభుత్వంతో మమేకం చేశారు.. ఇప్పడు వారికి జనాదారణ కూడా పెరిగింది.. అందుకనే రాహుల్ లా కాకుండా కేసీఆర్ లా ముందునుండే లోకేశ్ ను ప్రభుత్వలోకి తీసుకురావాలని సూచించారట. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.