బలమయిన పునాది నిర్మించుకొంటున్న నారా లోకేష్
posted on Sep 11, 2015 @ 11:05AM
తెదేపా యువనేత నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు చాలా అవకాశం ఉన్నప్పటికీ ఆయన తొందరపడటం లేదు. 2014లో జరిగిన ఎన్నికలలోనే ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలలో లేదా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ వహారాల గురించి చర్చిస్తూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. నేటి నుండి ఆయన పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను మొదట తిరుపతి నుండి మొదలుపెడతారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, తాడేపల్లిగూడెం, అరుకు తదితర ప్రాంతాలలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు.
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ అనుబంధం పెంచుకొన్నట్లయితే వారి పూర్తి మద్దతు పొందవచ్చును. పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించవచ్చును. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేసుకోవచ్చును. ఏదో ఒకనాడు ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయం కనుక ప్రస్తుతం ఆయన చేస్తున్న కృషి వలన చాలా మంచి ఫలితాలే ఆశించవచ్చును. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా పార్టీ వ్యవహారాలపై పట్టు పెంచుకొని అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు.
ఒకవేళ లోకేష్ కూడా ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినట్లయితే అప్పుడు తెరాస పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలనే తెదేపా కూడా ఎదుర్కోవలసి వచ్చేది. తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నంత కాలం పార్టీ వ్యవహారాలకే పూర్తి సమయం కేటాయించిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత పార్టీ వ్యవహారాలు చూసేందుకు అసలు సమయం కేటాయించలేకపోతున్నారు. కనుక పార్టీ వ్యవహారాలను చూసుకొనేందుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొడుకు కె.టి.ఆర్. ని కానీ కూతురు కవితను గానీ నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారిరువురూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కనుక వారికీ ఇటువంటి ఇబ్బందే ఎదురవవచ్చును. పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.
కనుక ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ వ్యవహారాలు చూసుకోవాలనే లోకేష్ నిర్ణయం సరయినదేనని స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకొని, పార్టీ వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించి తెదేపాని మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలిగితే ఇక నారా లోకేష్ వెనక్కి తిరిగి చూసుకోనవసరం ఉండదు. అప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు స్వీకరించవచ్చును.