నంద్యాల అటు ఇటైతే పీకే పరిస్థితేంటి..?
posted on Aug 26, 2017 @ 4:06PM
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ న్యూస్ ఏమైనా ఉందా అంటే అది నంద్యాల ఉప ఎన్నిక అనే చెప్పవచ్చు. ప్రజల నాడికి గీటురాయిగా..2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డాయి. 80శాతం పైచీలుకు పైగా జరిగిన పోలింగ్‌తో..ఓటర్లు ఎవరికి విజయాన్ని అందించబోతున్నారో సోమవారం తెలిసిపోనుంది. ఆ సంగతి పక్కనబెడితే నంద్యాల ఫలితం ఇరు పార్టీల్లో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా అధికారానికి దూరమై..ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చొన్న వైసీపీ ఒకవేళ నంద్యాలలో ఓడితే కనుక ఆ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ పంచన చేరి..పార్టీ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉండవచ్చంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి భవితవ్యంతో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి కార్యదక్షతకు, సామర్థ్యంపై వైసీపీ శ్రేణుల్లో తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఎవరో కాదు..రాజకీయ వ్యూహకర్తగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ప్రశాంత్ కిశోర్. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్ అండ్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సర్వేలు పూర్తీ చేసి ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో..ఏం చేయకూడదో ప్రశాంత్ పలు సూచనలు కూడా చేశారు. ఇంకా అనేక కొత్త వ్యూహాల మీద కసరత్తు కూడా జరుగుతున్న సమయంలో నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది.
ప్రశాంత్ రాక పార్టీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోవడానికి రెండేళ్ల వరకు ఆగకుండానే.. ఈ లోగానే..నంద్యాల రూపంలో అవకాశం అందివచ్చింది. జగన్ కూడా ప్రశాంత్ కిశోర్ సత్తాను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించారు. అందుకు తగినట్లుగానే తనదైన మార్గాల ద్వారా నంద్యాలలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకున్నారు. దానిలో భాగంగానే టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డిని వైసీపీలోకి చేర్చుకోవడం..ఆయనకు టికెట్ ఇప్పించడం..ఎన్నికల వ్యవహారాలు ఇలా ప్రతీ ఒక్కటి ప్రశాంత్ కనుసన్నల్లోనే జరిగాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడాల్సిన స్క్రిప్ట్‌ను కూడా ప్రశాంత్ దగ్గరుండి రాయించారట..
అలా అంతా తానై వ్యవహరించిన చోట ఓడిపోతే మాత్రం ప్రశాంత్ సామర్థ్యంపై జగన్‌తో పాటు వైసీపీ జనాలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. మాములుగా జగన్ ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా..ఎవ్వరి మాటకు పెద్దగా విలువ ఇవ్వరని అంటూ ఉంటారు. కానీ ప్రశాంత్ మాటలను వైసీపీ అధినేత తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అప్పుడు ఆ విలువ కూడా ఇవ్వకుండా తనకు నచ్చిన రీతిన జగన్ సాగే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రశాంత్ కిశోర్ నంద్యాల పరీక్షలో నెగ్గుతారో లేదో వేచి చూడాలి.