నంద్యాలలో టీడీపీ ఓడినా.. గెలిచినా ఏం జరుగుతుంది..?
posted on Aug 24, 2017 @ 4:56PM
వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. 2 లక్షల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు..దాని ఫలితం ఈ నెల 28న రాబోతోంది. దాని కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మామూలుగా అయితే ఇది ఓ ఉపఎన్నిక మాత్రమే. దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో జరగడమే ఇంత హైప్‌కు కారణం. సాధారణంగా ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అతని కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. సాంప్రదాయాన్ని గౌరవించి అధికారపక్షమో, ప్రతిపక్షమో అక్కడ తమ అభ్యర్థిని పోటికి పెట్టవు. కానీ నంద్యాల వ్యవహారం వేరు..
ఇక్కడ శాసనసభ్యునిగా మరణించిన భూమా నాగిరెడ్డి తొలుత వైసీపీ టికెట్ తరపున గెలిచి తరువాత తన కుమార్తెతో కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు..ఆ తర్వాత తీవ్రమైన గుండెపోటుతో భూమా మరణించిన విషయం తెలిసిందే. అన్ని ఉప ఎన్నికల లాగానే నంద్యాల కూడా ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించడంతో..ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారి సార్వత్రిక ఎన్నికల నాటి రణరంగాన్ని తలపించింది. గెలుపు కోసం ఇరు పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేశాయి కూడా..ఇదంతా పక్కనబెడితే ఈ బైపోల్ రిజల్ట్ ఇరు పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అప్పుడే ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.
అధికార పార్టీ గెలిస్తే ఆ ఫలితం ఖచ్చితంగా వైసీపీని చావు దెబ్బ కొడుతుంది. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కొంది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని తన పార్టీ నేతలకు చెప్పుకుంటూ వస్తోన్న జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ గనుక ఓడిపోతే పెద్ద షాక్ తగిలినట్లే. మరో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు సైకిల్ గూటికి చేరిపోయే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ కనుక ఓడిపోతే చంద్రబాబు అండ్ టీమ్‌కి టైమ్ స్టార్టయ్యినట్లేనంటున్నారు..
మొదటిగా పార్టీ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న మంత్రి భూమా అఖిలప్రియ..నంద్యాలలో టీడీపీ ఓడిపోతే మంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదే జరిగితే ఆమె ఆళ్లగడ్డకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది..దీంతో దశాబ్దాలుగా నడుస్తోన్న భూమా కుటుంబం ఆధిపత్యానికి చెక్ పడినట్లే. ఆమెతో పాటు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఫరూక్, ఎస్వీ మోహన్ రెడ్డి అడ్రస్ గల్లంతవుతుంది. ఇక ఉప ఎన్నిక బాధ్యతను తీసుకున్న ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి కాల్వ శ్రీనివాసులపై కూడా ఓటమి ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాలన్నింటిని కూలంకషంగా విశ్లేషిస్తే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. మరి విజయం ఎవరిని వరిస్తుందో..ఓటమి ఎవరిని పలకరిస్తుందో ఈ నెల 28న తేలిపోనుంది.