మున్సిపల్ కార్మికులు లేకుండా ప్రజా ప్రతినిధులు స్వచ్చ భారత్ అమలుచేయగలరా?
posted on Jul 14, 2015 @ 11:18AM
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట దానిని అంతగా పట్టించుకోకపోయినా తరువాత మరేమయిందో కానీ చంద్రబాబు నాయుడు కంటే ఆయనే ఎక్కువ హడావుడి చేసారు. హైదరాబాద్ లో మురికివాడలన్నీ స్వయంగా పరిశీలించి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలుచేయించారు. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెతో అదంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.
మునిసిపల్ శాఖని స్వయంగా ముఖ్యమంత్రే చూస్తున్నప్పటికీ, సమస్య ఇంతవరకు రావడాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పడుతున్నాయి. ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో మంత్రులు అందరూ పుష్కరాల పైనే దృష్టి పెడుతున్నారు తప్ప అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే ఈ వర్షాకాలం సమయంలో రాష్ట్ర రాజధానిలో నానాటికి పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఎటువంటి చర్యలు చేప్పట్టడంలేదని విమర్శిస్తున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి, పుష్కరాల నిర్వహణకు వందల కోట్లు వెచ్చిస్తున్న తెలంగాణా ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు వెనుకాడుతోందని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తే వారికి అడిగిన దానికంటే మరొక్క శాతం ఎక్కువే జీతాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ కార్మికుల పట్ల ఎందుకు కటినంగా వ్యవహరిస్తున్నారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వారు కూడా తెలంగాణా రాష్ట్ర సాధనలో ఉద్యమించిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకొని వారి న్యాయమయిన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. స్వచ్చ భారత్ కార్యక్రమంలో సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, మంత్రులు చాలా మందే పాల్గొని ఉండవచ్చును. కానీ ఆ కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే మొట్ట మొదట మునిసిపల్ కార్మికుల చేయిపడాలి. రెండు రాష్ట్రాలలో మునిసిపల్ శాఖలలో పనిచేస్తున్న మహిళా కార్మికులు సైతం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కనుకనే రెండు రాష్ట్రాలలో చెత్త ఎప్పటికప్పుడు తొలగింపబడుతోందనే సంగతి చాలా మంది ప్రజలకి తెలియక పోవచ్చునేమో కానీ ప్రభుత్వాలకు తెలుసు. అటువంటప్పుడు వారి సేవలకు తగినంత ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎందుకు జంకుతున్నాయో తెలియదు.
మునిసిపల్ కార్మికులు పనిచేయడం మానివేస్తే అంటూ వ్యాధులు ప్రబలితే దానిని అరికట్టలేక మంత్రులు పదవులే కోల్పోయిన సంఘటనలు చూసారు. కనుక స్వచ్చ భారత్ అంటూ ప్రజాప్రతినిధులు హడావుడి చేయడం కంటే ముందు మునిసిపల్ కార్మికులకు అండగా నిలబడితో స్వచ్చ భారత్ చేసినట్లే!