అంభానీ రక్షణపై మాట మార్చిన హోంశాఖ
posted on Apr 23, 2013 @ 10:52AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటడ్ అధినేత ముకేష్ అంభానీకి ‘జెడ్’క్యాటగిరీ రక్షణ ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన హోంమంత్రిత్వ శాఖ, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు, మీడియాలో ఈ విషయమై జరుగుతున్న చర్చలకు జడిసి మాట మార్చిందిప్పుడు.
హోంశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ “ఎవరయినా వ్యక్తులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని రుజువుచేసే సరయిన ఆధారాలతో మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము ఆ అభ్యర్ధనను నిఘా వర్గాలకు అందజేసి విచారణ చేయిస్తాము. ఒకవేళ, వారు దానిని దృవీకరిస్తే, మేము తగిన భద్రత కల్పించేందుకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కకట్టి సదరు వ్యక్తులకు తెలియపరుస్తాము. దానికి వారు అంగీకరించినట్లయితే మేము సుశిక్షితులయిన మా సి.ఆర్. పీ.యఫ్. సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాము. ముకేష్ అంభానీకి జెడ్ క్యాటగిరీ భద్రతా కల్పించడానికి నెలకు రూ.15లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాము,” అని మీడియాకు తెలిపారు. కానీ, వారు వేసిన అంచనా మొత్తం ప్రతీనెలా చెల్లించేందుకు ముకేష్ అంభాని సుముకత వ్యక్తం చేసారా లేదా? అనే విషయంపై సమాధానం దాటవేశారు. అంటే, ప్రభుత్వం బహుశః అంభానీకి ఉచిత సేవలు అందజేసే ఆలోచనలో ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.
సీపీఐ పార్లమెంటు సభ్యుడు ఏపీ. బర్ధన్ పార్లమెంటులో ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శిస్తూ “దేశ రాజధానిలో సైతం స్త్రీలకు, చిన్నారులకు రక్షణ కల్పించలేని సిగ్గులేని ఈ ప్రభుత్వం, కొట్లాదిపతి అయిన అంభానీకి మాత్రం ప్రత్యేకరక్షణ ఏర్పాట్లు చేసేందుకు తెగ ఆత్రుతపడుతోంది. ప్రభుత్వం కార్పోరేట్ పెద్దల సేవలో తరించాలని ఉవ్విళ్ళూరడం సిగ్గుచేటు. సామన్య ప్రజల భద్రతకు పైసా ఖర్చు పెట్టాలంటే వెనకాడే ప్రభుత్వం, స్వయంగా స్వంత భద్రతా ఏర్పాట్లు చేసుకోగల అంభానీకి, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నుల నుండి సొమ్మును ధారాపోసి భద్రత కల్పించాలనుకోవడం, సామన్య ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి అది నడిపిస్తున్న ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో తెలియజేస్తోంది,” అని తీవ్రంగా విమర్శించారు.
కొసమెరుపు ఏమిటంటే, నిన్నహోంమంత్రి సుషీల్ కుమార్ షిండే లోక్ సభలో ప్రతిపక్షాల విమర్శలకు జవాబిస్తూ “ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేవలం ఒక్క డిల్లీలోనే అత్యాచారాలు జరగట్లేదు. యావత్ భారత దేశంలో జరుగుతున్నాయి,” అని నిర్లజ్జగా చెప్పడం విశేషం. ప్రతిపక్షాలు మళ్ళీ అయన మీద దుమ్మెత్తి పోస్తే గానీ,తానూ మాట్లాడిన మాటల్లో పొరపాటును ఆయన గ్రహించలేకపోయారు.