ముద్రగడ కమెడియన్ అవుతున్నాడా..?
posted on Mar 10, 2016 @ 4:42PM
ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్టు ప్రస్తతం ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూస్తుంటే. కాపులకు అన్యాయం జరుగుతుందంటూ... కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ఉద్యమం.. నాలుగైదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి బాగానే ఫేమస్ అయ్యారు. ఆయన చేసిన దీక్షకు ఫలితంగా ప్రభుత్వం తన డిమాండ్లు తీర్చుతానని చెప్పడంతో ఏదో ఒక రకంగా సర్ధి చెప్పడంతో తన దీక్షను విరమించారు. ఇక అంతటితో పరిస్థితి కాస్త చక్కబడింది. అయితే ఆతరువాత ముద్రగడ దీక్షకు వెనుక జగన్ హస్తం ఉందని.. జగన్ వల్లే ముద్రగడ దీక్ష చేశారని పలు ఆరోపణలు వచ్చాయి.
అది అయిపోయిందంటే ఇప్పుడు మరో బాధ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయిందంటూ.. అదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను ఓ దొంగ, ద్రోహీ అని టీడీపీ నేతలతో తిట్టించారు అని అన్నారు. నాపై వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేను తప్పానా..?.. కాపు డిమాండ్లను అవహేళన సమంజసమేనా.. అధికారంలో ఉన్నవాళ్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా అంటూ మళ్లీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు ముద్రగడ. అంతేకాదు మరోసారి దీక్ష కూడా చేస్తానని చెప్పారు.
అయితే ఆయన మరోసారి దీక్ష సంగతేమో కానీ దీనివల్ల కాపులకు కాపులకు మధ్య విబేధాలు తెలత్తుతున్నాయి. ఆయన చేపట్టదలచిన దీక్ష నేపథ్యంలో జిల్లాల కాపు సంఘాల నేతలతో ముద్రగడ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కొంత మంది ప్రభుత్వానకి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరికొందరు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంతో వాగ్వాదం మొదలైంది. దీంతో సమావేశం కాస్త రసాభాసగా తయారైంది. దీంతో ఇక చేసేది లేక ముద్రగడ దీక్షను వాయిదా వేసేశారు.
మొత్తానికి ముద్రగడ పరిస్థితి అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. రాను రాను ఆయన అందరూ ఆడించే బొమ్మలా తయారవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఆయన ఇలానే చేస్తే ప్రభుత్వం కూడా ఆయన డిమాండ్లకు తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయన అలానే ఉంటే అందరికి కమెడియన్ లా అవుతారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ముందు ముందు ముద్రగడ పరిస్థితి ఇంకేలా తయారవుతుందో చూడాలి.