ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానానికి కేంద్రం ఒకే!
posted on Sep 5, 2015 @ 9:04PM
సుమారు నాలుగు దశాబ్దాలుగా వన్ ర్యాన్ వన్ పెన్షన్ అమలుచేయమని భారత మాజీ సైనికులు ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే ఇంత కాలం వారి గోడుపట్టించుకొనేవారే లేరు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన 15నెలల్లోనే వారి సమస్యను తన శక్తిమేర పరిష్కరించారు. రక్షణమంత్రి మనోహర్ పర్రికర్ శనివారం ఈ వన్ ర్యాన్ వన్ పెన్షన్ విధానాన్ని జూలై 1, 2014 నుండి అమలుచేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిననాటి నుండి అన్నమాట. ఈ పెన్షన్ విధానంలో ముఖ్యాంశాలు:
1. తక్షణమే అమలులోకి వస్తున్న ఈ పెన్షన్ విధానం జూలై 1, 2014 నుండి వర్తింపజేయబడుతుంది.
2. మాజీ సైనికులు, సైనికాధికారుల వితంతువులకు మరియు అమరవీరులయిన సైనికుల, అధికారుల భార్యలకు జూలై 1, 2014 నుండి నేటి వరకు ఎర్రియర్స్ ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించబడుతుంది.
3. మాజీ సైనికులు, అధికారులకు మాత్రం ఈ ఎర్రియర్స్ రెండు మూడు వాయిదాలలో చెల్లించబడుతుంది.
4. ఈ పెన్షన్ విధానం సైన్యంలో పూర్తి కాలం పనిచేసి పదవీ విరమణ పొందినవారికి మాత్రమే వర్తిస్తుంది. వివిధ కారణాల చేత స్వచ్చందంగా పదవి విరమణ చేసిన వారికి ఇది వర్తించదు.
5. ప్రతీ ఐదేళ్ళకు ఒకసారి ఈ పెన్షన్ పెంచబడుతుంది. ఎంత అనేది అప్పటి పరిస్థితులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
6. ఒకే హోదాలో ఒకే నిర్దిష్ట కాలంపాటు పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికులకు, సైనికాధికారులకు ఒకే విధంగా పెన్షన్ చెల్లించబడుతుంది. ఉదాహరణకి కొత్తగా పదవీ విరమణ చేస్తున్న సైనికుడు నెలకి రూ. 15, 000 పెన్షన్ అందుకొంటున్నట్లయితే, పదేళ్ళ క్రితం అదే హోదాలో అంతే సమయం పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికుడుకి ఒకవేళ నెలకి రూ.8500 అందుకొంటున్నట్లయితే, జూలై 1, 2014 నుండి ఆ సైనికుడికి కూడా నెలకి రూ. 15, 000 పెన్షన్ చెల్లింపబడుతుంది. ఈ నూతన పెన్షన్ విధానం వలన చాలా కాలం క్రితం పదవీ విరమణ చేసిన సైనికులు, సైనికాధికారులు, వితంతువులకి పెన్షన్ ఒకేసారి చాలా భారీగా పెరుగుతుంది. అందుకే మాజీ సైనికులు ఈ ఒకే హోదా-ఒకే పెన్షన్ కోసం చిరకాలంగా ప్రభుత్వాలని అడుగుతున్నారు.
7. ఈ నూతన పెన్షన్ విధానం 2013 సం.లో గరిష్ట మరియు కనిష్ట పెన్షన్ల ఆధారంగా లెక్క వేయబడుతుంది.
8. దీని కోసం ఒక మాజీ న్యాయమూర్తితో కూడిన జ్యూడిషియరీ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విధానంలో లోటుపాట్లలను, ఎదురయ్యే సమస్యలపై అధ్యయనం చేసి ప్రతీ అరు నెలలకి ఒకసారి ఆ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇస్తుంటుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ నూతన పెన్షన్ విధానాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తుంటుంది.
9. జూలై 1, 2014 నుండి నేటి వరకు మాజీ సైనికులకు చెల్లించాల్సిన ఎర్రియర్స్ సుమారు రూ. 10,000-12, 000 కోట్ల వరకు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ తెలిపారు. ఈ ఆర్ధిక సం.లో మాజీ సైనికులకు పెన్షన్ కోసం బడ్జెట్ లో కేటాయించిన రూ.58, 000 కోట్లకు ఇది అధనం అవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి ఇది కొంచెం భారమే అయినప్పటికీ సైనికులు దేశానికి చేసిన, చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్రికర్ తెలిపారు.