ఏపీకి కేంద్ర నిధులొచ్చే ఛాన్సుందా?
posted on Feb 17, 2015 @ 10:49AM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి బీజేపీతో చేతులు కలిపారు. ఆయన ఊహించినట్లే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చేయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఇరు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి గనుక విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహాయం చేస్తుందని అందరూ ఆశించారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టక ముందు నుండి నేటి వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కేంద్రం హామీలను అమలుచేస్తామని హామీ ఇవ్వడం మినహా పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు. కొన్ని రోజుల క్రితం రూ.850 కోట్లు మంజూరు చేసింది. కానీ అది పుండు మీద కారం చల్లినట్లయింది. దానితో చంద్రబాబు కూడా కొంత ఘాటుగానే మాట్లాడలసి వచ్చింది.
ఆ తరువాతే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో మరిన్ని నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతూ ఆశపెట్టిన వెంకయ్య నాయుడు అది సాధ్యం కాదని కుండబ్రద్దలు కొట్టారు. గానీ మళ్ళీ ఇప్పుడు ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మాట మార్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే 9 నెలలు గడిచిపోయాయి. కానీ ఆంధ్రాలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. తెదేపా-బీజేపీల మధ్య మంచి సంబందాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వారు భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఇంత జాప్యం జరుగుతుండటంతో తెదేపా ప్రభుత్వంపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తామని చెపుతున్న ఎన్డీయే ప్రభుత్వం తమ భాగస్వామి అయిన తెదేపా ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుని మరి ఇన్నిసార్లు డిల్లీ చుట్టూ ఎందుకు త్రిప్పించుకొంటోందో...ఆయన అంతగా తిరుగుతున్నా రాష్ట్రానికి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో తెలియదు.
చంద్రబాబు, కేసీఆర్ ఇరువురు కూడా మళ్ళీ మోడీని వేరువేరుగా కలిసి మరోమారు ఆయనకి తమ తమ రాష్ట్రాల పరిస్థితులు వివరించి కేంద్ర సహాయం అర్ధించారు. ఇటీవల కాలంలో మోడీ, కేసీఆర్ బాగా దగ్గరవుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానివలన తెలంగాణా రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని ఆశించవచ్చును. తమతో మంచి సంబంధాలు కలిగి ఉన్న తెదేపా అధినేతని పట్టించుకోని ఎన్డీయే ప్రభుత్వం మరి నిన్న మొన్నటి వరకు తమపై కత్తులు దూసిన కేసీఆర్ అభ్యర్ధనలు మన్నిస్తుందా...లేదా? అనేది త్వరలోనే తేలిపోతుంది. తెదేపా-తెరాస-బీజేపీల మధ్య సంబంధాలలో ఎటువంటి మార్పులు ఏర్పడుతున్నప్పటికీ, రాష్ట్ర విభజన వలన తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకొంటే ప్రజలు కూడా దానిని గుర్తించి ఆ పార్టీని కూడా అక్కున చేర్చుకొంటారు. అలాకాక ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాగే అరకొరగా నిధులు విదిలిస్తుంటే, ప్రాంతీయ పార్టీ అయిన తెదేపా ఎలాగో ఒకలా ఈ సమస్యల నుండి గట్టెక్కగలదు. కానీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తహతహలాడుతున్న బీజేపీ మాత్రం ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది.
ఈ సంగతి బీజేపీకి తెలియకపోదు. కానీ తెలిసి కూడా ఎందుకు తాత్సారం చేస్తోందో తెలియదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడయిన జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న డిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్రాన్ని అభ్యర్ధించి వచ్చేరు. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు మిత్రపక్షమయిన తెదేపా ప్రభుత్వానికి చురకలు వేసేందుకు చూపుతున్న శ్రద్ధని రాష్ట్రానికి నిధులు తేవడం కోసం తమ అధిష్టానంపై ఒత్తిడి చేసేందుకు చూపితే ప్రజలు కూడా సంతోషిస్తారు.