మతతత్వపార్టీ మజ్లిస్ : కాంగ్రెస్ ఎదురుదాడి
posted on Nov 15, 2012 @ 4:09PM
యూపీయే సర్కారుకీ, రాష్ట్ర సర్కారుకీ రామ్ రామ్ చెప్పి వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపు అడుగులువేస్తున్న మజ్లిస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడిని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలమేరకు నేరుగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంఐఎంని కడిగిపారేసి 24 గంటలైనా గడవకముందే మంత్రి శైలజానాథ్ కూడా మజ్లిస్ పై నోరు చేసుకున్నారు.
కొత్తి మిత్రుల్ని వెతుక్కుని, చాలా కాలంగా ఉన్న పాతమిత్రులకు గుడ్ బై చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్న మజ్లిస్ వైనాన్ని జనం చూస్తున్నారంటూ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మజ్లిస్ పార్టీయే పెద్ద మతతత్వ పార్టీ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే షాజహాన్ విమర్శించారు.
మజ్లిస్ పార్టీలా ప్రాంతం, మతం పేరుతో రాజకీయాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని కిల్లి కృపారాణి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ శక్తులకు కొమ్ముకాస్తోందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.