Read more!

తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవానికి యాక్షన్ ప్లాన్!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు.. సైకిల్‌ని మెరుపు వేగంతో సవారీ చేయించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి.. పక్కాగా అమలు చేస్తోంది. అందులోభాగంగా రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ... నాయకుల్లో భరోసా కల్పిస్తోంది. అలాగే అన్ని డివిజన్లలో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో  సమావేశాలు నిర్వహించడంతోపాటు .. ప్రతి నియోజకవర్గంలో 35 వేల మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. లాగే గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే కాకుండా.. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధి ఏ విధంగా జరిగిందనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని.. అందుకు కరపత్రాలను సైతం ముద్రించి పంచాలని భావిస్తోంది. అలాగే ఇంటింటికి టీడీపీ అనే వ్యూహాంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఇక పార్టీలోకి కీలక నేతలంతా.. అధికార పార్టీలోకి జంప్ కొట్టేయడంతో... సైకిల్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ పునర్ వైభవం తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో.. ఎలా చేయాలో.. అంతా చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కృత  నిశ్చయంతో ఉంది. ఆ క్రమంలో ఇప్పటికే టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్.. పగ్గాలు చేపట్టిన.. నాటి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలను కలిసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇక ఇంటింటికి టీడీపీ వ్యూహాంలో భాగంగా.. గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అలాగే ర్యాలీలు, కర్రపత్రాలు ముద్రించి పంచడం.. జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను సైతం చేపట్టాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి.. వారి గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.

అలాగే పార్టీని క్లిష్ట సమయంలో అంటిపెట్టుకొని ఉన్న నేతలకు టికెట్లు ఇస్తామని ఇప్పటికే అధిష్టానం క్లియర్ కట్ గా ఓ సందేశాన్ని ఇచ్చింది. అలాగే పని తీరు ఆధారంగా టికెట్లు కేటాయించాలని  కూడా నిర్ణయించింది. ఇక పార్టీ రాష్ట్ర కమిటీతోపాటు  అనుబంధ సంఘాల్లో ఉన్న ఖాళీలను సైతం సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయనున్నారు. అలాగే బలహీనంగా ఉన్న అసెంబ్లీ లోక్‌సభ స్థానాల్లో అధ్యక్షులను మార్చి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించి.. ఎన్నికలకు వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలను గెలుచుకొంది. అలాగే 2019 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో అంటే 2023 లో జరిగే ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చేటేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఏదీ ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే దిశగా టీడీపీ అధిష్టానం బలమైన వ్యూహాన్ని రచిస్తోంది. అదీకాక.. పలు పార్టీలో ఉన్న అసంతృప్తి జీవులు... మళ్లీ తన సొంత టీడీపీ గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకుని.. ముందుకు వెళ్లితే.. తెలంగాణలో మళ్లీ సైకిల్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.