కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు: మంద జగన్నాధం
posted on Apr 21, 2013 @ 10:10PM
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ యంపీ మంద జగన్నాధం తమ పార్టీ తెలంగాణ ఇవ్వబోదని ఈ రోజు మీడియా ముందు కుండ బద్దలుకొట్టారు. తమ పార్టీలో తెలంగాణ అంశాన్ని చూస్తున్న ఒక పెద్ద మనిషి తెలంగాణ ఇవ్వడం సాద్యం కాదనట్లు తనతో చెప్పినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
తమ పార్టీ తెలంగాణ ఇవ్వదని స్పష్టం అయిపోయింది గనుక, మరో పక్క ఈ మద్యనే తెరాస అధినేత కేసీఆర్ తో రహస్యoగా సమావేశం కూడా అయినందున, తెలంగాణకు హ్యాండిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే హ్యాండిచ్చి గులాభీ కారేక్కబోతునట్లు ప్రకటిస్తారని అందరూ అనుకొంటే, ఆయన మాత్రం మరికొన్ని రోజులు కాంగ్రెస్ చేయిపట్టుకొనే ముందుకు సాగాలనుకొంటున్నట్లు ప్రకటించడం విశేషం. అంటే, ఆయన కూడా కేసీఆర్ పెట్టిన ఏప్రిల్ 27 డెడ్ లైన్ లోగా కారేక్కడం కుదరదని చెప్పేసినట్లే అనుకోవచ్చును.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “మా అధిష్టానం తెలంగాణ ఇవ్వదని స్పష్టం చేసినట్లయితే అప్పుడు మా భావి కార్యాచరణ ప్రకటిస్తాము. అంతవరకు మరికొన్ని రోజులు ఎదురుచూడాలనుకొంటున్నాము. మా పార్టీ అధిష్టానం తెలంగాణ మాట్లాడేవారందరినీ అసమ్మతి వాదులుగా ముద్ర వేసి దూరం పెడుతోంది. కానీ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కావూరి సాంభశివరావు వంటి వారిని మాత్రం డిల్లీకి పిలిపించుకొని, వారి వ్యక్తిగత సమస్యలపై కూడా చర్చలు జరుపుతోంది. పదవికి రాజీనామా చేసిన ఆయన, చర్చల తరువాత తన రాజీనామా ఉపసంహరించుకోవడం కూడా చూసాము. పార్టీ అధిష్టానం ఆంద్ర నేతలతో ఒకలాగ, తెలంగాణ నేతలతో మరోలా వ్యవహరిస్తోంది. ఇందుకు పార్టీలో కొందరు వ్యక్తులు మాకు వ్యతిరేఖంగా రిపోర్ట్ చేయడమే కారణం అని భావిస్తున్నాను. ఏమయినప్పటికీ, మా పార్టీ రాబోయే ఎన్నికలలోగా తెలంగాణ ప్రకటించనట్లయితే తెలంగాణ లో పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. అటువంటప్పుడు మేము మా దారి చూసుకోక తప్పదు,” అని కుండ బద్దలు కొట్టేసారు మందా వారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని కేసీఆర్ కు కూడా చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ, ఆయన ఆ విషయం సరయిన సమయంలో బయటపెట్టి పూర్తి ప్రయోజనం పొందుదామని ఆలోచిస్తుంటే, మందావారు తొందరపడి ‘మా పార్టీ తెలంగాణ ఇవ్వదు’ అని ఆ దేవరహస్యం కాస్తా ముందే బయట పెట్టేసి, కేసీఆర్ కారుకి బ్రేకులు వేసారు. ఇప్పుడు ఆయనే ఇంత స్పష్టంగా ప్రకటించేసిన తరువాత, ఇక కేసీఆర్ తనకి డిల్లీ నుండి సంకేతాలు వస్తున్నాయని చెప్పుకోవడానికే అవకాశం లేకుండా పోయింది. క్యారమ్స్ బోర్డు మీద ముందే మన మందా వారు రెడ్ కాయిన్ వేసేసిన తరువాత కేసీఆర్ చిల్లర ఎంత గలగలలాడిస్తే మాత్రం ఏమి లాభం ఉంటుంది?
పైగా ఆయన‘మా పార్టీ తెలంగాణ ఇవ్వదు. అయినా కూడా మేము మా పార్టీని వీడము’ అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఒకటి రెండు డజన్లు, తెదేపా నుండి మరో రెండు మూడు డజన్ల మంది నేతలు తమ పార్టీలోకి చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారంటూ ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ కి పుండు మీద ఇంత కారం కూడా చల్లినట్లయింది. మరి రేపటి నుండి కేసీఆర్ మళ్ళీ తన పాత పల్లవి అందుకొని కాంగ్రెస్ నేతలందరూ సన్నాసులు, దద్ధమలు, దగుల్బాజీలు, తెలంగాణ ద్రోహులు అంటూ బూతులు లంకించుకొంటే ఆ బూతులు కూడా తమ ఉద్యమంలో వ్యుహాత్మకమేనని తెరాస సర్ది చెప్పుకోవచ్చునేమో కానీ, మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ విధంగా అర్ధం చేసుకొoటారోలేదో చూడాలి మరి.