వైకాపావైపు మల్లాది విష్ణు అడుగులు
posted on Nov 18, 2012 @ 1:31PM
బెజవాడ సెంట్రల్ శాసన సభ్యుడిగా ఉన్న మల్లాది విష్ణుకి ఇప్పుడు లగడపాటి రాజకీయం ఊపిరాడనివ్వడంలేదు. విష్ణుకి పరమశత్రువైన అడపానాగేంద్రని పట్టణ అధ్యక్షుడిగా, మీసాల రాజేశ్వరరావుని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం వెనక లగడపాటి హస్తం పూర్తిగా ఉందన్న విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.
తనకి బద్ధ వ్యతిరేకి అయిన అడపా నాగేంద్రని తీసుకొచ్చి తన నెత్తిన కూర్చోబెట్టడమేంటని లగడపాటిపై విష్ణు చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఇక తన హవా కొనసాగడం కష్టమని తెలుసుకున్న విష్ణు వైకాపా నేతలతో బేరసారాలు సాగిస్తున్నట్టు సమాచారం.
సెంట్రల్ స్థానాన్ని ఇచ్చేస్తే వైకాపాలో చేరడానికి తనకేమీ అభ్యంతరం లేదని వైఎస్సాఆర్ సీపీ నేతలతో మల్లాది విష్ణు చెప్పినట్టు సమాచారం. విష్ణుకి అత్యంత సన్నిహితుడైన అంబటి వైకాపా కీలక నేత అంబటి రాంబాబు రంగంలోకి దిగారు. భూమన కరుణాకర్ రెడ్డితో విష్ణుని పార్టీలోకి లాగే వ్యవహరం విషయమై అంబటి ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.
మల్లాది విష్ణు దివంగత రాజశేఖర్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా చెలామణీ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విష్ణుకి ఉడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. 2009లో సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు.
వై.ఎస్ మరణం తర్వాత ఆయనకు దగ్గరగా ఉన్న నేతలందరికీ పార్టీలో ఎదురౌతున్న పరిస్థితులే విష్ణుకి కూడా ఎదురౌతున్నాయి. కాబట్టి వైకాపాలోకి దూకేయాలన్న ఆలోచన బలంగా చేస్తున్నారని, జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.