లవ్ లో ఉన్నవారు పొరపాటున కూడా ఈ పనులు చేయ్యకూడదు..!
posted on May 29, 2024 @ 9:30AM
ప్రేమ ఒక మైకం అంటారు. ప్రేమలో ఉన్నవారి ప్రపంచం వేరే ఉంటుంది. అందులో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు వారి మధ్య బంధం చాలా లోతుగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రేమ మత్తులో ఉన్నారని అంటుంటారు. ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి అయినా సంకోచించరు. ఈ క్రమంలోనే ప్రేమికులు ప్రేమ మత్తులో కొన్ని పనులు చేసి తరువాత బ్రేకప్ అయ్యాక కుమిలిపోతుంటారు. లవ్ లో ఉన్నవారు తమ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే.. పొరపాటున కూడా కొన్ని పనులు చెయ్యకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ లవ్ లో ఉన్నవారు చెయ్యకూడని పనులేంటో ఓ లుక్కేస్తే..
ఫొటోస్..
చాలామంది ప్రేమికులు ఇంచుమించు భార్యాభర్తల్లానే బిహేవ్ చేస్తుంటారు. పెళ్లి కాలేదు.. కలసి ఉండలేదు అనే విషయం మినహాయిస్తే అన్ని విధాలా ఓపెన్ అయిపోతుంటారు. కానీ చాలా క్లోజ్ గా ఉన్నాం కదా అని ప్రైవేట్ ఫొటోలను తమ పార్ట్నర్ తో పంచుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు నార్సిసిస్టక్ మెంటాలిటీ కలిగి ఉన్నవారు అయితే బ్రేకప్ తరువాత అమ్మాయిలను బ్లాక్మెయిల్ చెయ్యడం, వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం వంటి వాటికి అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించే ప్రమాదం ఉంటుంది.
అంతే కాదు.. ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల సైబర్ నేరాల బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫొటో గ్యాలరీకి పర్మిషన్ అడుగుతుంటాయి. ఈ ఫొటోలు సదరు యాప్ కు వెళ్లిపోతాయి. ఈ ఫొటోల ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ప్రైవేట్ ఫొటోస్ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు.
బ్యాంక్ అకౌంట్..
బ్యాంక్ ఖాతా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత ఆర్ఠిక విషయం. ప్రేమలో ఉన్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆర్థిక విషయాలు పంచుకోవడం సబబు కాదు. ప్రేమలో ఉన్నప్పుడు లవ్ పార్ట్నర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే సున్నితంగా అవన్నీ చెప్పడం ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పాలి. కానీ కొందరు తమ లవ్ పార్ట్నర్ ఎక్కడ నొచ్చుకుంటారో అనే ఆలోచనతో అన్నీ చెప్పేస్తుంటారు. లవ్ లో బ్రేకప్ వచ్చి విడిపోతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.
కుటుంబం..
ప్రేమలో ఉన్నవారు సంతోషం, దుఃఖం, బాధ వంటి విషయాలు అన్నీ ఓపెన్ గా చెప్పుకోవం మంచిదే కానీ కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కుటుంబ వ్యక్తిగత విషయాలు అన్నీ ఓపెన్ అయ్యి చెప్పుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబానికి, కుటుంబంలో వ్యక్తుల గౌరవానికి ఎప్పటికైనా ఇబ్బందే. చనువుతో ఓపెన్ అయ్యి చెప్పుకున్న కొన్ని విషయాలు తరువాత బ్రేకప్ అయినప్పుడు నలుగురికి చాలా సులువుగా చేరిపోతాయి. అప్పుడు ఎవరికి వారు వారి కుటుంబ పరువును, గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది.
రహస్యాలు..
ఇప్పటి కాలంలో పరిచయాలు చాలా తొందరగా జరిగిపోతాయి. అదే విధంగా దగ్గరితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ బందం ఏదైనా నిలబడటమే కష్టంగా ఉంటుంది. ఒకరి నుండి విడిపోయాక మళ్ళీ ఇంకొకరితో పరిచయం కావడం, వారితో మళ్ళీ దగ్గరి తనం ఏర్పడటం, అది కాస్తా ప్రేమకు దారితీయడం చాలా వేగంగా జరుగుతాయి. ఈ క్రమంలో ఎవరితోనూ గతానికి సంబంధించి విషయాలు ఓపెన్ అయ్యి చెప్పుకోకూడదు. దీనివల్ల వ్యక్తిత్వం మీద దారుణమైన ముద్రలు, అవమానాలు ఎదురవుతాయి.