ఈనాటి ఈ బంధమేనాటిదో..!
posted on Nov 16, 2012 @ 5:06PM
ఇద్దరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు.. కలసిఉంటే కలదు సుఖం.. విడిపోతే తీరని దుఃఖం అన్న సత్యాన్నికూడా తెలుసుకున్నారు. కాకపోతే ఇన్నాళ్లూ ఇగోలు అడ్డొచ్చాయ్.. నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటూ ఇద్దరమూ నష్టపోతున్నామన్న విషయాన్ని ఇద్దరూ తెలుసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ ఒక్కటైతే గట్టిగా నిలబడొచ్చన్న నిర్ణయానికొచ్చారు.
అయితే.. విభేదాల్ని పక్కనబెట్టి ఎవరు ముందుగా ఎవర్ని పలకరిస్తారన్నదే ఇక్కడ మీమాంస.. కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. పాత మిత్రుణ్ణి ఇంటికి పిలిచిమరీ పలకరించారు. కోదండరాముడుకూడా నరసింహావతారమెత్తిన కెసిఆర్ ని పరామర్శించారు. ఇద్దరూ మళ్లీ భాయీభాయీ అనుకుని కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీ పెద్దల చేతుల్లో పార్టీని పెట్టేస్తానంటూ సాగిలపడ్డా లాభం లేని పరిస్థితిలో తిరిగొచ్చి ఎవరికీ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పరిస్థితీ, నోరుజారీ కేసులో ఇరుక్కున్న కోదండరాముడి పరిస్థితీ ఒకేలా ఉన్నాయ్. కలహాల కాపురంతో నష్టపోయేకంటే కలిసి ఉండి లాభపడడం మేలనుకుని ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిమీదికి చేరుతున్నారని టిఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయ్.