మజ్లిస్ కి గోనె ప్రకాష్ మద్దతు – కిషన్ రెడ్డి మండిపాటు
posted on Nov 15, 2012 @ 2:23PM
కాంగ్రెస్ నేత, ఆర్టీసీ మాజీ ఎండి గోనె ప్రకాశరావ్ మజ్లిస్ పార్టీని వెనకేసుకొస్తున్నారు. ఇంతక్రితం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతుని కోరి కూడగట్టిన విషయాన్ని మర్చిపోకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దివంగత ప్రథాని ఇందిరాగాంధీ సహా చాలామంది కాంగ్రెస్ నేతలు మజ్లిస్ మద్దతుని కోరి తెచ్చుకున్నవారేనని గోనె ప్రకాశరావ్ వ్యాఖ్యానించారు. కిందటి ఎన్నికల్లో మజ్లిస్ తో పొత్తు కారణంగానే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాంతాల్లో మైనారిటీల ఓట్లు దక్కాయన్నారు.
మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అటు మజ్లిస్ పైన ఇటు ఆ పార్టీని వెనకేసుకొస్తున్న గోనె ప్రకాశ్ రావ్ పైన మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ మరో వర్గం ముస్లిం ఓటర్లకు అస్సలు ప్రాపకం లేకుండా చేస్తోందంటూ విమర్శించారు. పాతబస్తీ రాజకీయాన్ని రాష్ట్రరాజకీయం చేయాలనుకోవడం మజ్లిస్ అవివేకమని మండిపడ్డారు.
భాగ్యలక్ష్మీ దేవాలయం విషయంలో ఒక్క బిజెపి మాత్రమే మజ్లిస్ పార్టీని నిలదీస్తోందని, మిగతా పార్టీలేవీ పట్టించుకోవడంలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఉపసంహరించుకున్న మరుక్షణమే రాజీనామా చేయాల్సిన హైదరాబాద్ మేయర్ ఇంకా ఎందుకు పదవిలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.