Read more!

జాతీయ దూకుడుకు బ్రేక్ కేసీఆర్ మరో యూ టర్న్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే విషయంలో పునరాలోచనలో పడ్డారా? రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా ఆయన ఇంట గెలిచి రచ్చగెలవాలనే నిర్ణయానికి వచ్చారా? అంటే, రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో జరుగతున్న ముందస్తు ఎన్నికల సన్నాహాలు, ఇతర పరిణామాలను గమనిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో మరోమారు యూ టర్న్ తీసుకున్నట్లే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్  ఫోకస్ జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వైపుకు మరలినట్లే ఉందని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరో ఎనిమిది నెలలలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ముందస్తు సంకేతాలు ఇవ్వడంతో ముందస్తు ఆలోచనకు మరింత బలం చేకూరిందని అంటున్నారు.ముందు రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయలపై ఫోకస్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

అయితే అదే ఫైనల్ నిర్ణయం అనుకునే వీలులేదనీ కేసీఆర్ ను ఎరిగిన నేతలు అంటున్నారు. నిజానికి పార్టీ వర్గాల సమాచారం మేరకు  ముఖ్యమంత్రి ప్రస్తుతానికి రాష్ట్ర శాసన సభ ఎన్నికల పైనే దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా  ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమా వెళ్ళక పోవడమా అనే మీమాంసలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తేనే గానీ, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని పార్టీ నాయకులు అంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలపై దృష్టిని కేంద్రేకరిస్తుందనే సమాచారంతో, ముఖ్యమంత్రి ఇటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి విభిన్న కోణాల్లో ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ, విజయదసమి (అక్టోబర్ 5) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. అయినా, ఆ తర్వాత పెద్దగా ముందడుగు పడలేదు.  ఆ వెంటనే, కేంద్ర ఎన్నికల సంఘానికి, పేరు మార్పుకోసం, తెరాస మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్ నాయకత్వంలో తెరాస నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, నవంబర్  7న కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పార్టీ పేరు మార్పుకు అవసరం అయిన మేరకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పేరున బహిరంగ పత్రికా ప్రకటన వెలువడింది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొంది.

ఒకవేళ పార్టీ పేరు మార్చే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిని 30 రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపవచ్చని పేర్కొన్నారు.అంటే, డిసెంబర్ 7 తర్వాతగానీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అవకాశమే కాదు అవసరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. పార్టీ పేరు మార్పు విషయంలో ఎన్నికల సంఘం ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. సో ... డిసెంబర్ 7 తర్వాత గానీ, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అంతే కాదు, ముగ్గురు కమిషనర్లు హాజరైన పూర్తి స్థాయి సమావేశంలో మాత్రమే, పార్టీ పేరు మార్పు నిర్ణయం తీసువలసి ఉంటుందని అంటున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల సంఘం మూడవ కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం జరిగినా, ఆయన నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తపు పట్టిది. న్యాయవిచారణ జరుగుతోంది. సో .. ఇప్పట్లో తెరాస పేరు మార్పు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. 

బీఆర్ఎస్ ముందడుగు పడక పోవడానికి అదొక సాంకేతిక కారణం అయినా ప్రధాన కారణం మాత్రం రాజకీయ మైనదే అంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచే విషయంలోముఖ్యమంత్రి పునరాలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే, డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం విషయంలోనూ వెనకడుగు వేశారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు,ఆతర్వాత జిల్లాలలో బహిరంగ సభలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి బీజేపీనే అనే విషయంలో క్లారిటీ వచ్చిన నేపధ్యంలో కేంద్రం, బీజేపీ పై యుద్ధం కొనసాగుతుందని అంటున్నారు.