కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా?
posted on May 3, 2013 @ 11:46AM
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ మరియు తెదేపా నేతలకు తన పార్టీలో చేరేందుకు పెట్టిన ఏప్రిల్ 27వ తేది డెడ్ లైన్ దాటివారం రోజులవుతున్నా ఒక్కరు కూడా పార్టీలో చేరెండుకు ముందుకు రాకపోగా, నిన్న తమ పార్టీలోంచే వరంగల్ కు చెందిన చాడా సురేష్ రెడ్డివంటి బలమయిన నేతలు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో జేరిపోవడానికి రంగం సిద్దం చేసుకోవడంతో కేసీఆర్ చాల కలవరపడుతున్నారు.
దీనికి విరుగుడుగా ఆయన రాబోయే ఎన్నికలలో పోటీచేసే తమ పార్టీ అభ్యర్దులను త్వరలో ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా తమ పార్టీనుండి ఇతర పార్టీలలోకి వలసలు అడ్డుకట్ట వేయడమే కాకుండా, ఇతర పార్టీలలో తమవైపు చూస్తున్నఅభ్యర్దుల పైన ఒత్తిడి పెంచి, వారిని తమవైపు రప్పించవచ్చని ఆయన ఆలోచన చేస్తున్నారు. మొట్టమొదటి లిస్టులో మొత్తం 17 మంది సిట్టింగ్ యం.యల్యే.ల పేర్లు, మరియు 5మంది లోక్ సభ సభ్యుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు. వీరికి అదనంగా మరో 20-25మంది శాసన సభ్యుల పేర్లను కూడా ప్రకటించేందుకు అభ్యర్ధుల లిస్టుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.
కనీసం తొలి లిస్టు ప్రకటించిన తరువాత అయినా ఇతర పార్టీల నుండి తెరసలోకి అభ్యర్దుల వలసలు మొదలవుతాయని కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఇంతకాలం ఉద్యమం కోసం పోరాడిన వారిని కాదని, ఈవిధంగా ఇతర పార్టీల నేతలను ఏదోవిధంగా పార్టీలోకి ఆకర్షించి వారికే పార్టీ టికెట్స్ కట్టబెట్టాలనుకోవడం పార్టీ కోసం పనిచేసిన వారికి చాలా ఆగ్రహం తెప్పిస్తోంది. కానీ, కేసీఆర్ వారి ఆగ్రహావేశాలు పట్టించుకోదలచలేదు. ఎందుకంటే, రాబోయే ఎన్నికలలో పార్టీకి గెలుపు గుర్రాలను కాదని, భావోద్వేగాలకు లోబడి బలహీనమయిన అభ్యర్ధులను ఎంచుకొంటే, ఎన్నికలలో బలమయిన కాంగ్రెస్, తెదేపా అభ్యర్దుల చేతిలో పరాజయం తప్పదు. అది ఆయన పార్టీకి పరాజయమే కాకుండా, అది తెలంగాణా ఉద్యమంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
రాబోయే ఎన్నికలలో తెలంగాణా నుండి ఇతర పార్టీలను తరిమి కొట్టి తెలంగాణపై పూర్తిపట్టు సాదిద్దామని కలలు కంటున్న కేసీఆర్, అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఉన్న బలమయిన గెలుగు గుర్రాలను తన వైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఈ ఎన్నికలలో విజయం సాదిస్తే ఉద్యమం కోసం పోరాడిన వారందరికీ నామినేటడ్ పదవులు ఇస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.
మరి ఆయన ఈ ఆలోచనలను పార్టీలో టికెట్స్ ఆశిస్తున్నవారు అర్ధం చేసుకొంటారో లేదో మొదటి లిస్టు విడుదలయితే కానీ తెలియదు. తద్వారా, ఆయన ఆశిస్తున్నట్లు ఇతర పార్టీలనేతలు తెరసలోకి వచ్చిపడతారో లేక తెరాస నుండే బయటకి వలసలు మొదలవుతాయో చూడాలి.