కావూరి ఫైర్
posted on Oct 28, 2012 @ 9:33AM
కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం లభించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా సందడిసందడిగా వుంటే... సీనియర్ నాయకుల్లో మాత్రం ఆగ్రహం పెల్లుబుకుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కస్సుబుస్సు మంటున్నారు. తాను ఇంతకాలం పార్టీకి చూపించిన విధేయతకు, సీనియారిటీకి గుర్తింపు లేకుండా పోతోందని కావూరి సాంబశివరావు గత కేబినెట్ విస్తరణలో మొండిచేయి లభించినప్పుడే వాపోయారు. పార్టీలో ఇక కొనసాగడం ఎందుకనే ఆవేదననూ వ్యక్తం చేశారు. ఈసారి కూడా విస్తరణలో కేబినెట్ బెర్త్ దొరక్కపోవడంతో ఆయన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కావూరిని అహ్మద్‌పటేల్, బొత్స సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు బుజ్జగించినప్పటికీ ఆయన వినడం లేదు. ఐదుసార్లు ఎంపీగా వున్న తనను కాదని, కొత్త వారిని, వేరే పార్టీలనుంచి వచ్చినవారిని అందలం ఎక్కిస్తున్నారన్న కావూరి ఆవేదన కాంగ్రెస్‌లో అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. రాయపాటి సాంబశివరావుది కూడా అదే పరిస్థితి. ఆయన కూడా అంతే ఆవేదనతో వున్నారు. పార్టీలో గుర్తింపు లేకుండా పోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తితో వున్న రాయపాటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అది కూడా దక్కలేదు. కేంద్ర కేబినెట్‌లో ఈసారీ చుక్కెదురైంది. అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చిన నాడూ తమను దూరంగా వుంచారని, ఇప్పుడేమో కొత్తవారికి ప్రాధాన్యం పేరిట దూరంగా వుంచారని కావూరి, రాయపాటి ఆవేదన చెందుతున్నారు.