అలక వీడిన కడియం
posted on May 2, 2013 @ 4:53PM
గత ఏడు నెలలుగా పాదయాత్రలలో ఎంతో శ్రమపడిన చంద్రబాబు, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నిన్నటి నుండే తన కార్యాలయానికి తిరిగి హాజరుకావడంతో పార్టీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా రాజకీయ నాయకుల హడావుడి కూడా పెరిగిపోయింది. తెరాస నుండి తెదేపాలోకి రావలనుకొంటున్న సురేష్ రెడ్డి వంటి నేతలతో సహా పార్టీ నేతలు, కార్యకర్తల హడావుడి మొదలయిపోయింది. ఈ రోజు చంద్రబాబు పార్టీ తెలంగాణా ఫోరం సభ్యుడు కడియం శ్రీహరితో దాదాపు గంటసేపు సమావేశం అయ్యారు.
ఇటీవల ఆయనకీ, ఫోరంలో మరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులకి మద్యన జరిగిన వివాదం గురించి కడియం బాబుకి వివరించినట్లు సమాచారం. పార్టీ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినప్పటికీ తెలంగాణాలో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోగా మరింత క్షీణించిందని, అందుకు పార్టీ నేతల మద్య సమన్వయము, కృషి లోపించడమే ప్రధాన కారణమని ఆయన తెలంగాణా ఫోరం సమావేశంలో చెప్పిన మాటలనే చంద్రబాబుకి కూడా వివరించి, తన సూచనలను సానుకూల దృక్పధంతో స్వీకరించకపోగా మోత్కుపల్లి నరసింహులు తనను చీడపురుగుతో పోలుస్తూ అవమానకరంగా మాట్లాడిన విషయం గురించి కడియం చంద్రబాబుకి పిర్యాదు చేసారు.
ఇన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తనపై తెరాసలోకి వెళిపోతానని పుకార్లు కూడా మొదలయ్యాయని అందుకు తానూ చాలా బాధపడుతున్నానని ఆయన తెలియజేసి, ఇందుకు కారణమయిన వారిమీద తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా కడియం శ్రీహరికి నచ్చజెప్పినట్లు సమాచారం.సమావేశానంతరం మీడియాతో కడియం శ్రీహరి మాట్లాడుతూ, తమ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏమిలేదని, కేవలం పార్టీ వ్యవహారాలూ మాట్లాడేందుకే సమావేశం అయ్యామని అన్నారు.
మళ్ళీ బస్సు యాత్ర గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు, ఇటువంటి చాల వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంది. ముఖ్యంగా విజయవాడ లోక్ సభ స్థానాన్ని ఆశించి భంగపడిన గద్దె మోహన్ రావు, గన్నవరం సీటుకోసం ఆశిస్తున్న వల్లభనేని వంశీ, విశాఖలో అయ్యన్నపాత్రుడికి బండారు సత్యనారాయణ వర్గాలకు మద్య చెలరేగిన వివాదం వంటి అనేక సమస్యలు నివురు గప్పిన నిప్పులా ఉన్నందున వాటికి పూర్తి పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. ఇక, ఈ నెల హైదరాబాదులో తలపెట్టిన మహానాడు సమావేశాలలో పార్టీ అభ్యర్ధులను ప్రకటించదలిస్తే దానికి చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. బహుశః మరో రెండు నెలల వరకు చంద్రబాబుకి ఈ వ్యవహారాలు చక్కబెట్టడానికి సరిపోవచ్చును.