తొండం లేకుండా పూజలు అందుకునే వినాయకుడి గురించి తెలుసా? లెటర్ లు రాసి మరీ కోరికలు కోరుతారండోయ్!
posted on Aug 28, 2025 @ 9:30AM
భారతదేశంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు దేశం యావత్తు ఎంతో గొప్పగా, మరెంతో భక్తిగా జరుపుకుంటారు. ప్రతి పూజలోనూ తొలి పూజలు అందుకునే వినాయకుడిని తొమ్మిది రోజులు కొలువుంచి ఘనంగా పూజ చేయడం, ఆ తరువాత ఎంతో గొప్పగా ఊరేగింపు చేసి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం చేస్తారు. అయితే దేశంలో చాలా చోట్ల పండుగలు, దేవుళ్ల విషయంలో చాలా వింతలు చూస్తుంటాం. అలాంటి వింత ఒకటి ఇప్పుడు తెలుసుకుంటే..
తొండం లేని వినాయకుడు..
దేశ వ్యాప్తంగా గణేశుడి ఆలయాలు వందలాది ఉన్నాయి. ఆ ఆలయాలలో కొన్ని చాలా ప్రత్యేకం. వాటిలో ఒకటి రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న గర్ గణేష్ ఆలయం. గర్ గణేష్ ఆలయం అతి పెద్ద విశేషం ఇక్కడ గణేశుడికి తొండం ఉండదు. అంటే ఇక్కడ గణేషుడు బాల రూపంలో ఉంటాడట. ఇక్కడ వినాయకుడికి తొండం ఉండదు. వినాయకుడు ఇక్కడ పురుషాకృతి రూపంలో కూర్చుని ఉన్నాడని నమ్ముతారు. .
ఆలయ చరిత్ర..
18వ శతాబ్దంలో మహారాజా సవాయి జై సింగ్ II ఈ ఘర్ గణేష్ మందిరాన్ని నిర్మించాడు. జైపూర్‌ను స్థాపించే ముందు ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ ఆలయానికి పునాది వేశారని చెబుతారు. సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో కనిపించే విధంగా ఆయన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రత్యేకమైన ప్రణాళిక నుండి మహారాజా భక్తి, నిర్మాణ దృష్టిని అంచనా వేయవచ్చు. బారి చౌపాడ్‌లో ఉన్న ధ్వజాధీష్ గణేష్ మందిరం ఘర్ గణేష్ మందిరంతో కనెక్ట్ చేసి ఉంది, దీనిని దానిలో భాగంగా భావిస్తారు.
కష్టాల ఏకరువు..
ఘన్ గణేష్ ఆలయం చాలా చారిత్రకమైనదే కాకుండా పూజా పద్ధతి కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ గణేశుడి విగ్రహం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఎలుకలు ఉంటాయి. భక్తులు తమ సమస్యలను, కోరికలను ఈ ఎలుకల చెవులలో చెబుతారట. ఈ ఎలుకలు భక్తులు చెప్పుకునే బాధు, కోరికలను నేరుగా వినాకుడికి తెలియజేస్తాయని వినాయకుడు వారి కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు.
ఉత్తరంతో వినతులు..
ఘర్ గణేష్ మందిరంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భక్తులు తమ కోరికలను లేఖలు లేదా ఆహ్వాన పత్రాల రూపంలో స్వామికి సమర్పిస్తారు. మొదట్లో పెళ్లి కావాలని, బిడ్డలు కావాలని, ఉద్యోగ కావాలని ఇట్లా ఏదైనా కోరికలు ఉంటే వాటి కోసం ప్రతిరోజూ వందలాది లేఖలు స్వామి వారికి వచ్చేవి. వాటిని చదివి భగవంతుని పాదాల వద్ద ఉంచుతారట. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. వినాయకుడు భక్తుల గోడు వెంటాడని తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.
మెట్ల దారి..
తిరుమల వెంకన్నను దర్మించుకోవడానికి చాలామంది మెట్ల దారి గుండా నడిచి కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుందని, స్వామి అనుగ్రహానికి దగ్గర చేస్తుందని చెబుతారు. అయితే ఇదే విధంగా ఘర్ గణేషుడి ఆలయానికి కూడా ఇట్లాగే వెళ్లవచ్చు. కాకపోతే ఇక్కడ మెట్ల సంఖ్య 365. ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 మెట్లు ఎక్కాలి. ఈ ఎక్కడం కొంచెం అలసిపోయేలా ఉంటుంది, కానీ ఆలయానికి చేరుకున్న వెంటనే లభించే ప్రశాంతత అన్ని అలసటలను దూరం చేస్తుంది. ఇక్కడి నుండి, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో, మొత్తం జైపూర్ నగరం వ్యూ అద్భుతంగా కనిపిస్తుందని చెబుతారు. ఇదీ ఘర్ గణేషుడి ఆలయ ప్రత్యేకత.
*రూపశ్రీ.