జగన్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారా?
posted on Oct 17, 2015 @ 11:25AM
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం నాయకుడు జగన్మోహన్ రెడ్డి రానని చెప్పడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చంటిపిల్లాడిలాగ వ్యవహరిస్తూ తనకీ, తన పార్టీకి కూడా ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడేలా చేస్తున్నారని ప్రజలే అనుకొంటున్నారు. రాజకీయాలలో ఉన్నవారు ఎంతో బ్యాలన్స్ గా ఉండాలి. ప్రతీ దానికి వెంటనే ఆవేశంగా స్పందించడం, దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అసలే తగదు. అటువంటివాళ్ళు ప్రజల నోళ్ళలో, మీడియాలో బాగానే నానుతారు కానీ రాజకీయాలలో మాత్రం ఎన్నడూ రాణించలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మాజీ మంత్రి శంకర్ రావు వంటివాళ్ళు అనేకమంది సజీవ సాక్ష్యాలుగా కళ్ళముందే ఉన్నారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి చాల విపరీతంగా ద్వేషిస్తున్నారు కనుక ఆయన, ప్రభుత్వం ఏమి చేసినా దానిని వ్యతిరేకించడమే “వైకాపా పాలసీ”గా మార్చుకొని ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగానే కనబడుతోంది. ఆ కారణంగా ఆయన చేస్తున్న పోరాటాలు ఎన్నడూ విజయవంతం కాలేకపోతున్నాయని చెప్పవచ్చును. ఆయన ప్రజల తరపున నిలబడి పోరాడుతున్నప్పటికీ వారి మద్దతు పొందలేకపోతున్నారు. ఆ విషయం ఆయన ఇంతవరకు గ్రహించక పోవడం విచిత్రమే.
రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి రాష్ట్రాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి దొరకాలంటే తప్పకుండా ప్రత్యేక హోదా కావలసిందేనని వాదిస్తూ నిరాహార దీక్ష చేసారు. ఆయన నిజంగానే ప్రత్యేక హోదా కోసమే నిరాహార దీక్షకు కూర్చొని ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు అందరూ ఆయనకి తప్పకుండా మద్దతు పలికేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు మరే ఇతర సమస్య కనబడకపోవడంతో ఈ సమస్యని అందుకొని దీక్షకి కూర్చొన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం దానిపై హామీ ఇచ్చే పరిస్థితి ఉండదు కనుకనే దానిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ఆయన దీక్ష చేసారని చెప్పవచ్చును. అందుకే తన దీక్షలో చంద్రబాబు నాయుడుని ఆయన ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ యుద్ధం చేసారు తప్ప ప్రత్యేక హోదా ఏవిధంగా సాధించుకోవాలని ఆలోచనలు చేయలేదు.
అమరావతి శంఖుస్థాపనకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ముమ్మురంగా అందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రాష్ట్ర ప్రజల దృష్టి వాటిపైకి మళ్లడంతో జగన్ దీక్షకు ఆశించినంతగా స్పందన రాకపోవడం, చివరికి తమ దీక్షను పోలీసులచేత భగ్నం చేయించమని ప్రాధేయపడవలసిన పరిస్థితులు ఎదురవడంతో జగన్ అండ్ కో చంద్రబాబు నాయుడుపై, ఆయన ప్రభుత్వంపై చాలా పగతో రగిలిపోవడం సహజం. బహుశః అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రానని జగన్ ప్రకటించేశారు. అయితే తన కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని వెనకటికి ఎవరో అనుకొన్నట్లే, తను వెళ్ళకపోతే శంఖుస్థాపన కార్యక్రమానికి జరగదనే భ్రమలో జగన్ ఉన్నట్లున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రజలకి తన గురించి ఎటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారో గ్రహించడం లేదు. ఇటువంటి దుందుడుకు వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో..అనే ఆలోచన ప్రజలలో ఆయనే స్వయంగా రేకెత్తించగలిగారు. ప్రజలు తాము చంద్రబాబు నాయుడిని ఎన్నుకొని పొరపాటు చేయలేదని గ్రహించేలా జగన్ చేసారు.
జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన 24 గంటల వరకు వైకాపా నేతలు ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చి తమ అధినేతను సమర్ధిస్తూ మాట్లాడకపోవడం గమనించినట్లయితే ఆయన తన నిర్ణయం ప్రకటించే ముందు తన పార్టీలో సీనియర్ నేతలెవ్వరినీ సంప్రదించలేదని స్పష్టం అవుతోంది. పార్టీ అంటే కేవలం తనే అనే అభిప్రాయం ఉన్నవాళ్ళే ఈవిధంగా వ్యహరిస్తుంటారు. అటువంటివాళ్ళు ఇంకా చాల మందే ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది కనుక ఏమి మాట్లాడినా ఏమి చేసినా చెల్లుతుంది. కానీ ప్రతిపక్షంలో కూర్చొని పార్టీకి ఈవిధంగా శల్య సారధ్యం చేస్తుంటే చివరికి ఆయన నడుపుతున్న వైకాపా రధం ఎన్నికల యుద్దరంగం చేరేనాటికి అందులో ఎవరూ ఉండకపోవచ్చును. అందరూ అవతలవైపు నిలబడి ఆయనతోనే యుద్ధం చేయడానికి నిలబడి ఉండే అవకాశం ఉంటుంది.