జగన్ కూర్చొన్న కొమ్మనే నరుకొంటున్నారా?
posted on Oct 15, 2015 @ 5:06PM
సినిమాలలో హీరోలని డేరింగ్ అండ్ డాషింగ్ గా చూపిస్తారు. అప్పుడే సినిమాలు హిట్ అవుతుంటాయి. కానీ నిజ జీవితంలో అందునా రాజకీయాలలో ఆ దూకుడు మరీ ఎక్కువయితే మొదటికే మోసం వస్తుంది.
జగన్మోహన్ రెడ్డికి ఆ దూకుడు అవసరమయిన దానికంటే చాలా ఎక్కువని మళ్ళీ ఇవ్వాళ్ళ మరొకమారు నిరూపించారు. రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తను రానని కుండబద్దలు కొట్టినట్లు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవ్వాళ ఆయన ఒక బహిరంగ లేఖ వ్రాసారు. అంటే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసినట్లే రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమయిన కార్యక్రమాన్ని కూడా ఆయన బాయ్ కాట్ చేస్తున్నారన్నమాట. అందుకు ఆయన ఎనిమిది కారణాలు పేర్కొని, ప్రభుత్వానికి తన నిరసన తెలియజేసేందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాదలచుకోలేదని తెలిపారు.
ఓటుకి నోటు-ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆంద్రప్రదేశ్-తెలంగాణా ప్రభుత్వాలు రెండూ దాదాపు ప్రత్యక్ష యుద్దానికి దిగిన విషయాన్ని కూడా పక్కనబెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని స్వయంగా ఆహ్వానిస్తానని చెపితే అందరూ హర్షించారు. ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చెప్పినప్పుడు కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా హర్షించారు. తెదేపాను, చంద్రబాబు నాయుడును, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బద్ద శత్రువులుగా భావిస్తున్న తెరాస మంత్రులు సంప్రదాయం పాటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరవుతుంటే రాష్ట్రానికే చెందిన జగన్మోహన్ రెడ్డి దానిని బాయ్ కాట్ చేయాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎందరో ప్రముకులు తరలి వస్తుంటే, రాష్ట్రంలో క్యాబినెట్ హోదా గల ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏవో కారణాలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే రాజధాని నిర్మాణం జరగడం తనకి ఏమాత్రం ఇష్టం లేదని లిఖితపూర్వకంగా ప్రకటించుకొన్నట్లయింది.
సారవంతమయిన పంట భూముల మీద రాజధాని నిర్మించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. కానీ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సర్దిచెప్పుకొని రాజధాని నిర్మాణం వేగంగా జరగాలని కోరుకొంటున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు అదే రాజధానిలో అడుగుపెట్టకుండా ఉండగలరా? తన పార్టీ ప్రధాన కార్యాలయం, కంపెనీలు, వ్యాపార సంస్థల కార్యాలయాలు అన్నిటినీ అక్కడే ఏర్పాటు చేసుకోకుండా ఉండగలరా? అంటే ఉండలేరనే చెప్పవచ్చును. మరి అప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తనకు స్థలం కావాలని అడగగలరు?
ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న కారణాలు సహేతుకంగానే ఉండవచ్చును. కానీ అసలు కారణం మాత్రం ఆయన చంద్రబాబు నాయుడుని చాలా ద్వేషిస్తున్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని చెప్పవచ్చును. జగన్ కంటే కేసీఆర్ తదితర తెరాస నేతలు చంద్రబాబు నాయుడుని ఇంకా ఎక్కువగానే ద్వేషిస్తున్నారు. కానీ సంప్రదాయాన్ని, ఈ కార్యక్రమ విశిష్టతని దృష్టిలో పెట్టుకొని ఈ చారిత్రిక శుభ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని తెలిపి అందరి మన్ననలు పొందారు. జగన్ తన ధర్నాలు, దీక్షలతో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనతో రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకొన్నారు. అతను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే చెందినవాడయినా రాష్ట్రానికి వ్యతిరేకి అనే ముద్ర వేసుకొన్నారు. ఇటువంటి దుందుడుకు, అనాలోచిత నిర్ణయాల వలన ఇంతవరకు చాలాసార్లు భంగపడ్డారు. అయినా జగన్ తన తీరు మార్చుకోకుండా ముందుకు సాగుతూ రాష్ట్రానికి, తన పార్టీకి కూడా సమస్యలు సృష్టిస్తున్నారు.