బెడిసికొడుతున్న జగన్ వ్యూహాలు
posted on Oct 15, 2015 @ 10:30AM
ప్రత్యేక హోదా కోసం అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షతో ఏమి సాధించారు...అంటే రాష్ట్రంలో తన పార్టీ శ్రేణులను ఉత్తేజపరచగలిగారని చెప్పుకోవచ్చును. ఆయన ఈ దీక్ష ద్వారా మరో ప్రయోజనం కూడా ఆశించి ఉండవచ్చును. తెదేపా-బీజేపీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో తనకున్న ప్రజాధారణను నరేంద్ర మోడికి ప్రదర్శించడం ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలనే ఆలోచన ఇందులో ఇమిడి ఉండవచ్చుననిపిస్తోంది.
జగన్ తో సహా దీక్షా వేదిక నుండి మాట్లాడినవారందరూ మోడీ ప్రభుత్వంలో తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, అదే సమయంలో జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం గమనిస్తే జగన్ అదే వ్యూహం అమలుచేస్తున్నారేమో? ఆ వ్యూహానికి కొనసాగింపుగానే అక్టోబర్ 21 వరకు పార్టీ శ్రేణులతో రకరకాల నిరసన కార్యక్రమాలు కొనసాగించిన తరువాత, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి వచ్చినప్పుడు ఆయనను కలిసి తన దీక్ష గురించి, దానికి వచ్చిన ప్రజాస్పందన గురించి తెలియజేసేందుకే ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతున్నరనుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధాని దృష్టిని ఆకర్షించి, బీజేపీకి దగ్గరయ్యేందుకే జగన్ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ రాష్ట్రంలో తెదేపాతో తెగతెంపులు చేసుకొని వైకాపాతో చేతులు కలిపేందుకు సిద్దపడితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం తన పోరాటం కొనసాగిస్తారా? అనే సందేహం కలుగుతుంది. జగన్ ఉద్దేశ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా అధికారంలో నుండి దింపి తను ముఖ్యమంత్రి అవడమే తప్ప ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడం కాదు. అందుకే తన ఆరు రోజుల దీక్షలో కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయలేదు.
కానీ ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బందిపడుతున్న కేంద్రప్రభుత్వాన్ని తన దీక్షలు, ర్యాలీలు, ధర్నాలతో ఇంకా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ ఆదరించవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే జగన్ వ్యూహం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్ధం అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే తెదేపాతో తెగతెంపులు చేసుకొని తమ పార్టీతో చేతులు కలపకపోతే కేంద్రానికి, రాష్ట్రంలో బీజేపీకి తన ప్రత్యేక దీక్షలతో ఇబ్బంది కలిగిస్తూనే ఉంటానని జగన్ హెచ్చరిస్తున్నట్లుంది.
జగన్ ఇటువంటి ఆలోచనలతో, వ్యూహాలతో ముందుకు సాగడం వలన ఆయన విశ్వసనీయత ఇంకా ప్రశ్నార్ధకం అవుతుంది. బీజేపీని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో దానితో జగన్ ఈ విధంగా చెలగాటమాడితే చివరికి ఆయనే నష్టపోవచ్చును. అప్పుడు జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న వైకాపా కూడా తీవ్రంగా నష్టపోవచ్చును. తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని గ్రహిస్తే రాజకీయ నేతలు ఏమి చేస్తారో తెలుసుకొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కళ్ళ ముందే సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. జగన్ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారో లేదో తెలియదు కానీ తన అసంబద్ద, అనాలోచిత వ్యూహాలతో చివరికి తన పార్టీకి కూడా అటువంటి పరిస్థితి ఎదురవకుండా జాగ్రత్త పడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.